జగన్ ఒక మెట్టు దిగారు కానీ…

ఎలిమెంటరీ స్కూళ్లనుంచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం అనే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఒక మెట్టు దిగారు. 1నుంచి 6వ తరగతి వరకు మాత్రమే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిషు మీడియం బోధన ప్రారంభం…

ఎలిమెంటరీ స్కూళ్లనుంచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం అనే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఒక మెట్టు దిగారు. 1నుంచి 6వ తరగతి వరకు మాత్రమే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిషు మీడియం బోధన ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతి తరగతులకు బహుశా ప్రతి ఏటా ఒక్కో తరగతిని ఇంగ్లిషు మీడియంలోకి మారుస్తూ పోతారు.

శనివారం అధికార్లతో సమీక్షల తర్వాత.. ఆయన ఈ చిన్న మార్పును సూచించారు గానీ.. ప్రభుత్వం చేస్తున్న ఈ కొత్త ఆలోచన పట్ల వ్యక్తం అవుతున్న ప్రధానమైన అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోలేదు.

ఉపాధి అవకాశాల పరంగా ఇంగ్లిషు నేర్చుకుంటే ఇతర ప్రాంతాలు, విదేశీ ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతాయన్నది… ఒక ఆలోచన. ఇది చాలా వరకు నిజమే కావొచ్చు. కానీ.. పరిపూర్ణమైన ఆలోచన అనడానికి మాత్రం వీల్లేదు.

ప్రపంచదేశాల్లో మనం అమెరికాను మాత్రమే సాధారణంగా  చూస్తుంటాం. కానీ.. జర్మనీ, జపాన్ వంటి అనేక దేశాల్లో ఆయా దేశాల్లోని స్థానిక భాషకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇంగ్లిషు ఎంత బాగా వచ్చినా, వారి భాష నేర్చుకోకపోతే.. అక్కడ ఉద్యోగాలు దక్కవు. దమ్మిడీకి కూడా కొరగారు.

అయితే ఎక్కువ ఉద్యోగాలను అందిస్తున్న కొన్ని దేశాల వరకు ఇంగ్లిషు ఉపయోగపడుతుందన్నది నిజమే. అందుకోసం.. రాష్ట్రంలో ఒకటో క్లాసునుంచి పూర్తిగా ఇంగ్లిషు మీడియంలోకి చదువులను మార్చేయడం అనేది చర్చనీయాంశం అవుతోంది.

తెలుగుమీడియంను కూడా అందుబాటులో ఉంచి.. అన్ని దశల్లోని పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం కూడా ప్రవేశపెట్టి ఉంటే ఇంకో తీరుగా ఉండేది. అప్పుడు తమకు ఏం కావాలో ఎంచుకునే వెసులుబటు పిల్లల తల్లిదండ్రులకు ఉండేది. అలా కాకుండా జగన్ ఇంగ్లిషు మీడియంను రుద్దుతున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు.

8వరకు అనుకున్న నిర్ణయాన్ని ఆరో క్లాసు వరకు పరిమితం చేశారు. సమాజంలో వెల్లువెత్తుతున్న అనేక రకాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. జగన్ తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉండేలా తమ ప్రభుత్వ నిర్ణయాన్ని దిద్దుకుంటే బాగుంటుంది. ఆ విషయంలో మాత్రం ఆయన పట్టు సడలించడం లేదు.

తెలుగు ఒక సబ్జెక్టుగా ఎటూ ఉంటోంది కదా.. అని ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ.. హిందీ కూడా స్కూళ్లలో ఒక సబ్జెక్టుగా ఉంటోంది. కానీ.. ఎంతమంది హిందీ భాషలో పట్టుమని పది పదాలు రాయగలిగేలా తయారవుతున్నారు? కొన్నేళ్లు గడిచేసరికి తెలుగు కూడా అదే దుస్థితికి చేరుకుంటుంది. జగన్ ఈ కోణంలోంచి కూడా ఆలోచించాలి.