మోడీకి జగన్ షాక్ ఇస్తారా?

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నార్సీకి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయనుంది. సీఏఏ, ఎన్నార్సీ లకు సంబంధించి.. ఆందోళనలు మిన్నుముట్టుతున్న తరుణంలో.. జగన్మోహన రెడ్డి సర్కారు కూడా తాము ఏ పక్షమో స్పష్టం…

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నార్సీకి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయనుంది. సీఏఏ, ఎన్నార్సీ లకు సంబంధించి.. ఆందోళనలు మిన్నుముట్టుతున్న తరుణంలో.. జగన్మోహన రెడ్డి సర్కారు కూడా తాము ఏ పక్షమో స్పష్టం చేయదలచుకుంది. అధికారికంగా.. ప్రభుత్వంలోని పెద్దలు ఎవ్వరూ ఇంకా దీనిపై అభిప్రాయం వెలిబుచ్చలేదు. అయితే, అలా అధికారిక పెద్దలు దీనిపై మాట్లాడడానికి తగిన సందర్భం కూడా రాలేదు. అమరావతి వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలలోనే… ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానం కూడా ఉంటుందని తెలుస్తోంది.

కొత్త చట్టాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న పరిణామాల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆచితూచి స్పందిస్తున్నారు. వీటిపై ఇప్పటికే కీలకమైన పెద్దలతో పలు విడతలుగా చర్చించారు. తమ పార్టీ విధానం ఎలా ఉండాలో ఒక నిర్ణయానికి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో తమ పార్టీ రాజ్యసభలో మద్దతిచ్చి.. ఆ బిల్లు చట్టం కావడానికి ఇప్పటికే సహకరించినందున.. దాని విషయంలో  మరో వైఖరి తీసుకుంటే.. మాట మార్చడం అవుతుందని, అనవసరంగా కొత్త నిందలను భరించాల్సి వస్తుందని జగన్ నిర్ణయించారు. అయితే ఎన్నార్సీ విషయంలో కేంద్రం దూకుడుకు అడ్డుకట్ట వేసేలా.. శాసనసభలో తీర్మానం చేయడానికి ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించి, సజ్జల రామకృష్ణారెడ్డికూడా కొన్ని రోజుల కిందట అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం అనే మాట మీడియతో చెప్పారు. నెల్లూరులో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. తమ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేయకుంటే గనుక రాజీనామాకు సిద్ధమని కూడా అన్నారు. తాజాగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా అదే మాట అన్నారు. అయితే.. పార్టీ విధానాలను తెలుసుకోకుండా ఇలాంటి మాటలు అన్నందుకు వీరిని మందలించడం  జరిగేది. అయితే, సున్నితమైన అంశం కావడం.. ఎన్నార్సీ వ్యతిరేక శాసనసభా తీర్మానానికి తమ పార్టీ సంసిద్ధంగానే ఉన్నందువల్ల… జగన్మోహన రెడ్డి వారిని పట్టించుకోలేదని సమాచారం.

ఈ విషయంలో ఎటూ ప్రతిపక్షాలు జనసేన, తెలుగుదేశం పార్టీ లనుంచి విమర్శలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేయడానికి జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వ్య‌క్తి చిరంజీవి