తెలుగుదేశం మళ్లీ తన కుటిల రాజకీయాలు ప్రారంభించింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో.. జగన్ ప్రభుత్వం గణాంకాల సహా.. గత ప్రభుత్వం ఏం చేసిందో.. తాము ఏం చేస్తున్నామో.. పత్రికా ప్రకటనలరూపంలో బయటపెట్టేసరికి వారికి మైండ్ బ్లాక్ అయింది. తమ బాగోతాలు బట్టబయలు అయినందుకు కంగారుపడింది. ఆ గణాంకాల వివరాలకు సూటిగా సమాధానం చెప్పలేక డొంకతిరుగుడు విమర్శలతో కుటిల రాజకీయాలు చేస్తోంది. అటు లోకేష్, ఇటు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అంతా ఆ బాటలోనే నడుస్తున్నారు.
వృద్ధులకు పెన్షన్లు ఇళ్ల వద్దకే అందించే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించిన నేపథ్యంలో ప్రభుత్వం పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. 2019 ఫిబ్రవరి దాకా చంద్రబాబు 1000 పెన్షన్ ఇస్తోంటే.. తమ ప్రభుత్వం తొలినాటినుంచి 2250 ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అలాగే 2018 ఫిబ్రవరి నాటికి లబ్ధిదారుల సంఖ్య కేవలం 44 లక్షలు కాగా, ప్రస్తుతం 59 లక్షల మందకి పెన్షన్లు అందుతున్నట్లు పేర్కొంది. గణాంకాల సహా వ్యవహారం బయటపెట్టేసరికి తెదేపా నాయకులు ఖంగుతిన్నారు. తమ కుటిల రాజకీయ అస్త్రాలను, తర్కబద్ధం కాని, లేకి విమర్శలతో విరుచుకుపడడం ప్రారంభించారు.
జగన్ తన పాదయాత్రలో మూడువేలు పెన్షన్ ప్రకటించేసరికి కంగారుతో చంద్రబాబు.. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు పెన్షన్ ను 2000కు పెంచారు. 2018 దాకా 44 లక్షల మంది మాత్రమే ఉండగా.. ఎన్నికల ఏడాదిలో.. పార్టీ వారందరికీ దొడ్డిదారిలో లబ్ధి చేకూర్చేలా దొంగపేర్లతో ఆ జాబితాను పెంచుకుంటూ పోయారు. వైకాపా సర్కారు వచ్చాక దొంగపేర్లను సరిచేసేసరికి… పెన్షను లబ్ధిదారుల్ని తొలగిస్తున్నారంటూ నానా యాగీచేశారు. ఇంత గోలచేసినా.. వైకాపా వచ్చిన తర్వాత లబ్దిదారుల సంఖ్య కేవలం ఈ 9 నెలల్లోనే 15 లక్షలు పెరిగింది. ఈవివరాలు బయటకు వచ్చేసరికి తెదేపా నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. పత్రికాప్రకటనల్లో తప్పుడు వివరాలున్నాయని, న్యాయపరమైన చర్య తీసుకుంటామని కళా వెంకట్రావు అంటున్నారు.
పత్రికా ప్రకటనల్లో గోలచేయడం మానేసి.. తెదేపా వారికి దమ్ముంటే.. ఈవిషయంలో న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని, తమ సత్యసంధతను, నిజాయితీని నిరూపించుకోవాలని వైకాపా నాయకులు కోరుతున్నారు.