వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ అసెంబ్లీ కోటాలో దక్కే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం దాదాపు ఖాయం అయినట్టేనేమో! ఇందుకు సంబంధించి అభ్యర్థి కూడా ఖరారు అయినట్టే అని, ఆయన మరెవరో కాదు ముకేష్ అంబానీ సన్నిహితుడే అనే విషయంపై గట్టి ప్రచారం సాగుతూ ఉంది. నాలుగు రాజ్యసభ సీట్లు దక్కుతున్న వేళ ఒకటి త్యాగం చేయడానికి జగన్ పెద్దగా వెనుకాడకపోవచ్చు. కేంద్రంతో సత్సంబంధాలకు ప్రాధాన్యతను ఇచ్చేందుకు ఒక ఎంపీ సీటును త్యాగం చేయడం ఆయనకు పెద్ద విషయం ఏమీ కాకపోవచ్చు.
మరి ఇప్పుడు ఎటొచ్చీ పవన్ కల్యాణ్ పరిస్థితే ఏమిటనేది ఆసక్తిదాయకంగా మారింది. బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే! ఏ రాజకీయ పార్టీలు అయినా ఏవైనా ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాయి! అయితే పవన్ పార్టీ మాత్రం పొత్తుతోనే ప్రయాణం చేస్తూ ఉంది. మరి ఆ పొత్తు పొడిచినప్పుడు ఒక షరతు పెట్టారట పవన్ కల్యాణ్. అదేమిటంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మోహన్ రెడ్డి తో బీజేపీ స్నేహం చేయకూడదని పవన్ ఒక షరతు పెట్టేశారట! అలాగే చంద్రబాబుతో రహస్యబంధం నెరపకూడదని బీజేపీ కూడా పవన్ కు ఒక షరతు పెట్టిందట!
అయితే చంద్రబాబుతో పవన్ ఎలాంటి సంబంధాలూ కలిగిలేడంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. పవన్ ను బీజేపీ వైపుకు పంపించిందే చంద్రబాబు నాయుడు అనే ప్రచారమూ ఉండనే ఉంది. ఇలాంటి క్రమంలో పవన్ కు మాత్రం ఇప్పుడు కోపం వస్తోందట. అదెందుకు అంటే.. వైఎస్ జగన్ సహకారంతో బీజేపీ రాజ్యసభ సీటును తీసుకోవడంపై పవన్ అసహనంతో ఉన్నారట! జగన్ తో సంబంధాలను పూర్తిగా కట్ చేసుకోమని తను చెప్పినా, బీజేపీ ఖాతరు చేయకపోవడంపై పవన్ కు ఆగ్రహం కలుగుతూ ఉందట. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తును రద్దు చేసుకునేందుకు కూడా పవన్ రెడీ అవుతున్నారట! ఇది ఒక ప్రచారం.
మామూలుగా అయితే పవన్ లెక్క ఇలానే ఉండాలి. తను పెట్టిన షరతులను బీజేపీ ఖాతరు చేయడం లేదు కాబట్టి.. పవన్ ఆ పార్టీకి దూరం కావాలి! అయితే ఇప్పుడంత సీనుందా? తన శత్రువు జగన్ సహకారం తీసుకుంటున్న బీజేపీతో పవన్ మిత్రుత్వాన్ని నెరపాల్సిందేనా! అంతకు మించి గతి లేదేమో ఇప్పుడు!