Advertisement

Advertisement


Home > Politics - Gossip

రూ.3 కోట్లు ఇస్తేనే నా మ‌ద్ద‌తు!

రూ.3 కోట్లు ఇస్తేనే నా మ‌ద్ద‌తు!

పొత్తులో భాగంగా తిరుప‌తి సీటు జ‌న‌సేన‌కు ద‌క్కింది. అభ్య‌ర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసుల్ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. దీంతో ఆర‌ణి శ్రీ‌నివాసులు తిరుప‌తిలో ఎన్నిక‌ల ఏర్పాట్లు చేసుకునే ప‌నిలో ఉన్నారు. తిరుప‌తిలో టీడీపీ, జ‌న‌సేన నుంచి టికెట్ ఆశావ‌హులు చాలా మందే ఉన్నారు. దీంతో స్థానికేత‌రుడ‌నే సాకుతో ఆర‌ణి శ్రీ‌నివాసులు అభ్య‌ర్థిత్వాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌లేదు. ఆర‌ణి శ్రీ‌నివాసులే త‌మ అభ్య‌ర్థి అని తేల్చేశారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ముందుగా త‌న పార్టీ నాయ‌కుల అసంతృప్తుల‌ను చ‌ల్లార్చేందుకు ఆర‌ణి అంద‌రినీ క‌లుసుకునేందుకు య‌త్నిస్తున్నారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ పార్టీ ఆదేశాల‌కు అనుగుణంగా ఆర‌ణికి వెన్నంటి న‌డుస్తున్నారు.

ఇంకో పే...ద్ద లీడ‌ర్ జ‌న‌సేన‌కు ఉన్నాడు. మీడియా పులి. రాయ‌ల్ కాని ఆ రాయ‌ల్ మ‌ద్ద‌తు విష‌య‌మై తిరుప‌తిలో ప్ర‌చార‌మ‌వుతున్న విష‌యమై తెలుసుకుందాం. "ఏంబ్బా ఈ ద‌ఫా నాకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌. ప‌వ‌న్ అన్న నాకు టికెట్ ఇచ్చారు. అందుకే తిరుప‌తికి వ‌చ్చా. తిరుప‌తిలో జ‌న‌సేన జెండా ఎగురేసేందుకు క‌లిసి ప‌ని చేద్దాం" అని రాయ‌ల్ కాని ఆ రాయ‌ల్‌తో ఆర‌ణి శ్రీ‌నివాసులు అన్నారు.

"వైసీపీ నుంచి వ‌చ్చి టికెట్ తెచ్చుకున్నావ్‌. అంతా బాగుంద‌న్నా. కానీ మ‌ద్ద‌తు ఇవ్వాలంటే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్" అని ఆర‌ణితో అత‌ను అన్నారు.

"ష‌ర‌తులా? ఏంట‌వి" అని ఆశ్చ‌ర్యంతో ఆర‌ణి ప్ర‌శ్నించారు.

"ఏంల్యా...ఐదేళ్లుగా పార్టీ కోసం సొంత ఖ‌ర్చులు పెట్టుకున్నా. ఏనాడూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. అంతా నా జేబులో నుంచి పెట్టిందే. ఆరేడు కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయ్యింది. టికెట్ వ‌స్తుంద‌నే ఆశ‌తోనే అప్పులు చేసి మ‌రీ కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకున్నా. నాకు టికెట్ ఇయ్య‌లేదు. మీరేమో అధికార పార్టీ నుంచి ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చి టికెట్ ఎగరేసుకుపోతిరి. మ‌రి నా గ‌తేం కావాలా?. క‌నీసం రూ.3 కోట్లు ఇస్తే త‌ప్ప నా మ‌ద్ద‌తు వుండ‌దు. ఈ మాట ఎవ‌రికి చెప్పుకున్నా నాకు భ‌యం లేదు" అని మ‌న‌సులో మాట‌ను ఆర‌ణి శ్రీ‌నివాసులు ఎదుట స‌ద‌రు రాయ‌ల్ కాని రాయ‌ల్ బ‌య‌ట పెట్టారు.

దీంతో ఆర‌ణి శ్రీ‌నివాసులు ఖంగుతిన్నార‌ని జ‌న‌సేన నేత‌లే చెబుతున్నారు. అందుకే స‌ద‌రు నాయ‌కుడు తిరుప‌తిలో ఆర‌ణి శ్రీ‌నివాసులు వెంట ఇంత వ‌ర‌కూ తిర‌గ‌లేదు. మీడియాలో మాత్రం తాను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వీరాభిమాని అన్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తుంటాడు. తిరుప‌తిలో మాత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌క‌పోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పైగా ఆర‌ణికి వ్య‌తిరేకంగా టీడీపీని ఎగ‌దోసింది కూడా అత‌నే అనే చ‌ర్చ న‌డుస్తోంది.

ఆర‌ణి శ్రీ‌నివాసులు ద‌య‌త‌ల‌చి రూ.3 కోట్లు ఇస్తే త‌ప్ప‌, అత‌ను ప్ర‌చారంలోకి దిగే మార్గం క‌నిపించ‌డం లేదు. దీనిపై జ‌న‌సేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?