వైకాపా అంటే తెలుగుదేశానికి మాత్రమే బద్ద శతృవు కాదు. తెలుగునాట బలమైన రెండు మీడియా సంస్థలకు కూడా ఆగర్భశతృవే. వాటిల్లో ఒక మీడియా సంస్థ అయితే మీడియా నైతికత అన్నది మరిచి, ఆ గీత దాటేసి మరీ జగన్ కు వ్యతిరేకంగా వందలు, వేలు కథనాలు వండి వార్చింది. వార్తా కథనాలు వేరు. సంపాదికీయాలు వేరు. స్వకాలమ్ లు వేరు. వాటిల్లో కూడా జగన్ వస్తే అరిష్టమే. ప్రళయమే, సునామీనే అన్నట్లు పోకడలు పోయింది.
జగన్ ను గెలిపిస్తే రాష్ట్రం అధోగతి పాలయిపోతుంది. జగన్ ఎట్టి పరిస్థుతుల్లోనూ గెలవకూడదు. జగన్ దొంగ, జగన్ ఇలా.. జగన్ అలా.. అంటూ ఎన్ని కథనాలో. అదే సమయంలో చంద్రబాబును కీర్తిస్తూ ఎన్ని రచనా చమత్కృతులో. ఇలాంటి మీడియాకు జగన్ కు జనం పట్టంకట్టడం జీర్ణం కావడంలేదు.
సాధారణంగా ఇంత అద్భుత విజయం చంద్రబాబు సాధించివుంటే, తొలిపేజీలో నిలువెత్తు మందహాసవదనుడైన చంద్రబాబు ఫోటో వుంటుంది. కానీ ఈ మీడియా చిన్న ఫొటో కింద వేసి సరిపెట్టింది. చంద్రబాబు గెలిచివుంటే, జనం ఇచ్చిన తీర్పును మెచ్చుకుంటూ, దుర్మధాంధుల పీచం అణిచిన ఓటర్లు అంటూ వాళ్లను వేనోళ్ల కీర్తించి, బాబును భుజాలకు ఎత్తుకుని మోసేది. కానీ ఈసారి మాత్రం మోడీ విజయాన్ని ప్రస్తావిస్తూ జగన్ విక్టరీ గురించి కూడా రాయాలి కదా అన్నట్లు రాసారు. ఓ మీడియా అంటే సరిగ్గా ఓ చిన్న పేరాతో జగన్ విజయాన్ని ప్రస్తావించి సరిపెట్టింది.
పార్టీలు స్వంతంగా పెట్టుకున్న విశాలాంధ్ర, ప్రజాశక్తి లేదా పార్టీ నేతల స్వంతమైన సాక్షి లాంటి వాటికి ఇలాంటి పక్షపాత ధోరణివుంటే సరిపెట్టుకోవచ్చు. అలాకాకుండా స్వంతంత్ర మీడియా సంస్థలు ఇలా ఓ పార్టీకి కొమ్ముకాయడం, భుజాన మోయడం, అంతకన్నా ఓ అడుగు ముందుకు వేసి, తమకు నచ్చని పార్టీని తమకు నచ్చిన పార్టీ కోసం తుంగలో తొక్కేయాలి, ఓడించాలి అని కంకణం కట్టుకుని కృషిచేయడం అన్నది ఎంత వరకు నైతికత అన్నది ఆ సంస్థలే ఆలోచించుకోవాలి.
నా కోడీ, నా కుంపటి అన్నది నిన్నటిమాట. ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ వచ్చేసింది. ప్రజాభిప్రాయాన్ని తమ అచ్చు అక్షరాల్లో దాచిపెట్టడం అన్నది ఇకపై సాధ్యంకాదని ఈ మీడియా సంస్థలు గుర్తించాలి.