బాబు ధీమా నవ్వుల పాలైన వేళ…

చంద్రబాబునాయుడు… నిన్నటిదాకా ‘గెలుపు మనదే’ అంటూ పదేపదే ఊదరగొడుతూ.. అపరిమితమైన ధీమా ప్రదర్శించారు. అయితే ఆ ధీమా మొత్తం ఒక్కసారిగా నవ్వులపాలైపోయింది. చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మాయ చేయదలచుకున్నారో… అలాంటి పన్నాగాలు ఫలించలేదని…

చంద్రబాబునాయుడు… నిన్నటిదాకా ‘గెలుపు మనదే’ అంటూ పదేపదే ఊదరగొడుతూ.. అపరిమితమైన ధీమా ప్రదర్శించారు. అయితే ఆ ధీమా మొత్తం ఒక్కసారిగా నవ్వులపాలైపోయింది. చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మాయ చేయదలచుకున్నారో… అలాంటి పన్నాగాలు ఫలించలేదని తేలిపోయింది. గోబెల్స్ సిద్దాంతాన్ని  నమ్ముకున్న చంద్రబాబు కేవలం మాటల గారడీతో, నిందారోపణలతో పబ్బం గడుపుకోవచ్చునని అనుకున్నారు గానీ… చివరికి నవ్వుల పాలయ్యారు.

ప్రజల నాడిని పసిగట్టలేకపోయిన తెలివిహీనుడు చంద్రబాబునాయుడు అని అనుకోవడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నట్లుగా ప్రజానాడి ఆయనకు చాలా స్పష్టంగానే ముందుగానే అంచనా తెలిసింది. అయితే వీలైనంత వరకు జగన్ కు ఉన్న ప్రజాదరణకు కోతపెట్టడానికే ఆయన ఏడాదిగా నానాపాట్లు పడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి విలన్ గా చిత్రీకరించడానికి శతవిధాల ప్రయత్నించారు. అయితే అలాంటి ఎత్తుగడలేమీ ప్రజలముందు ఫలించలేదు. వారు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి తెలివిగా తిప్పికొట్టారు.

పోలింగ్ జరిగిన నాటికే చంద్రబాబునాయుడుకు ఫలితం అర్థమైపోయిందని అనుకోవాలి. ఎందుకంటే.. ఆ నాటినుంచి ఆయన ఈవీఎంల మీద దాడి చేయడం ప్రారంభించారు. ఈవీఎంలను ట్యాంపర్ చేశారని, జగన్ కు ఎక్కువ ఓట్లుపడేలా మాయ చేశారనే ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంల మీద రాష్ట్రవ్యాప్త ఉద్యమం అంటూ రంకెలు వేశారు గానీ… దేశంలోని ఆయన సహచర ఇతర పార్టీలేవీ ఆయన గోడును పట్టించుకోలేదు.

మోడీ విలన్ అని ఏపీ ప్రజలు నమ్మేలా చేశానని అనుకున్న చంద్రబాబు… మోడీతో జగన్ కు ముడిపెట్టడం ద్వారా జగన్ ను కూడా రాష్ట్రానికి విలన్ గా చిత్రించే ప్రయత్నం చేశారు. అయితే ప్రజలు ఇలాంటివి పట్టించుకోలేదు. మోడీని, జగన్ ను వేర్వేరుగానే చూశారు. కేసీఆర్ ను ఏపీకి బూచిగా చూపించి… కేసీఆర్ తో జగన్ కు బంధాన్ని అంటగట్టి.. ఆ రకంగానూ… జగన్ మీద ప్రజల్లో విద్వేషాన్ని నాటాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ప్రజలు మొత్తంగా తిప్పికొట్టారు.

ఒకవైపు ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తూ… వీవీప్యాట్ స్లిప్పులు కూడా అక్రమమే అన్నట్లుగా కొత్త మాటలు వల్లిస్తూ… మరోవైపు మళ్లీ తెలుగుదేశమే గెలవబోతోంది అంటూ చంద్రబాబు పలికిన ప్రగల్భాలు డొల్లగా తేలిపోయాయి. ఆయన ప్రదర్శించిన ధీమా, తెలివితేటలు ముసుగులో ఆయన  ప్రదర్శించిన కుయుక్తులు అన్నీ ప్రజల ముందు నవ్వుల పాలైపోయాయి.