ఎమ్బీయస్‌: ముందు తెలిసెనా ప్రభూ…

'ముందు తెలిసినా ప్రభూ యీ మందిర మిటు లుంచేనా…' అని వాపోతారు దేవులపల్లి ఒక గేయంలో. నువ్వు వస్తున్నావని ముందుగా తెలిస్తే యిల్లు యింకా శుభ్రంగా ఉంచేవాణ్ని కదా అతని మొర. ఇవాళ బాబు…

'ముందు తెలిసినా ప్రభూ యీ మందిర మిటు లుంచేనా…' అని వాపోతారు దేవులపల్లి ఒక గేయంలో. నువ్వు వస్తున్నావని ముందుగా తెలిస్తే యిల్లు యింకా శుభ్రంగా ఉంచేవాణ్ని కదా అతని మొర. ఇవాళ బాబు గారికి యీ పాట గుర్తుకు వచ్చి ఉంటుంది. ఫలితాలు యిలా వస్తాయని ముందే తెలిస్తే యింతలేసి అవస్థలు పడకపోదును కదా అనుకుని నిట్టూర్చి ఉంటారు. ఫలితాలు యింకా పూర్తిగా రాలేదు కానీ టిడిపికి 30 లోపు అసెంబ్లీ స్థానాలు, 3 లోపు పార్లమెంటు స్థానాలు వచ్చేట్టున్నాయి. ఇద్దరో, ముగ్గురో ఎంపీలను వెంటేసుకుని నేను మూడో ఫ్రంటు కన్వీనరును అంటే ఎవరు మన్నిస్తారు? ఫలితాల తర్వాత దిల్లీలో సమావేశం అంటూ పది రోజులుగా ఒకటే రొష్టు పడ్డారు. ఊరూరూ వెళ్లి గడపగడపా తొక్కి మంతనాలు జరిపారు. బిజెపియేతర కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చూపిస్తానని మహా ముచ్చటపడ్డారు. ఇవాళ్టి ఫలితాలు చూశాక వాళ్లు సమావేశమూ లేదు, చట్టుబండలూ లేదు పొమ్మని ఉంటారు.

ఈ కూటమికి కేంద్ర బిందువుగా ఉండాల్సిన కాంగ్రెసు 100 స్థానాలు తెచ్చుకుంటుందని వేలం పాట మొదలుపెట్టి 150 దాకా వెళ్లిపోయారు. ప్రస్తుతానికి చూస్తే 55 దగ్గర ఆగింది. మొత్తం యుపిఏ చూసుకున్నా 100 లోపునే! అదీ డిఎంకె 22 సీట్లతో ఆదుకుంది కాబట్టి. లేకపోతే యుపిఏ బలం మరీ పేలవంగా ఉండేది. అలాటి నిరర్ధక రాహుల్‌ను నిలబెట్టే పని యీయన అనవసరంగా పెట్టుకున్నాడు. ఇక అదర్స్‌లో ప్రధాని పీఠం పైనే కన్నేసిన మమతా, మాయావతి యిద్దరూ చతికిల పడ్డారు. మమత తక్షణ కర్తవ్యం – తన ముఖ్యమంత్రి పదవి జారిపోకుండా చూసుకోవడం. శాంతిభద్రతల లోపం పేరు చెప్పి గవర్నరు నుంచి నివేదిక తెప్పించుకుని ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేయగల సామర్థ్యం మోదీ కుంది. అప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడ తేలుతుందో మమతకే తెలియదు. ఇక మాయావతికి ముందే సంకేతాలు అందినట్లున్నాయి – సోనియాతో సమావేశం లేదు అంటూ ముందే తప్పించుకుంది.

ఏ సంకేతమూ అందనిది మన బాబు గారికి ఒక్కరే. తనకు దాపురిస్తున్న ఓటమిని ఆయన గుర్తించలేకపోయాడు. అసెంబ్లీలో, పార్లమెంటులో ఘోరపరాజయం తప్పదు అని స్పష్టంగా గోడ మీద రాతలా కనబడుతున్నది కూడా ఆయన చదవలేకపోయాడు. అందుకే ఇవిఎంల గురించి యాగీ చేశాడు. కొద్దిపాటి మార్జిన్‌లో ఓడిపోయి వుంటే వాటి గురించి మాట్లాడినా అర్థముంటుంది కానీ యింత తేడా ఉన్నపుడు ఆ వాదనకు అర్థముండదు. అది తెలియక ఎన్ని ప్రయాణాలు చేశారు పాపం! ఎంతమంది జాతీయ నాయకులతో చర్చలు జరిపారు! వాళ్లంతా యీయన వృథాయాసాన్ని తలచుకుని పడిపడి నవ్వుకుంటున్నారేమో యిప్పుడు. చేతిలో రెండు ఎంపీ సీట్లు లేవు కానీ చక్రం తిప్పడానికి బయలుదేరాడు, మన టైము వేస్టు చేశాడు అనుకుని ఉంటారు.

జాతీయస్థాయి రాజకీయాలు వదిలేయండి. రాష్ట్రంలో యింత అన్యాయంగా మట్టి కరుస్తానని ఆయన ఎందుకు ఊహించలేకపోయాడు? ఏదైనా ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా ప్లాను చేస్తారని పెద్ద పేరు కదా! సర్వేలు చేయించి ప్రజా వ్యతిరేకతను కొద్దిగానైనా పసి గట్టలేకపోవడమేమిటి? ఎన్నికలైన తర్వాత కూడా 130 వస్తాయని చెప్పుకోవడం దేనికి? చివరకు ముందున్న 1 ఎగిరిపోయి, 30 వస్తాయో, అంతకంటె తక్కువ వస్తాయో! బాబు బీరాలు చూసి బహుశా తమకు 80-90 దగ్గర ఆగిపోతాయేమోనన్న భయంతో తన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అలా బింకం చూపుతున్నారనుకున్నాను. వెనక్కి తిరిగి చూస్తే, అదీ వృథా ప్రయాసే అని తేలింది. ఈ 25, 30 మంది ఎటున్నా ఒకటే. ఓటింగు శాతాలు యింకా వెలువడలేదు కాబట్టి కరక్టుగా చెప్పలేం కానీ సీట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో నాకు తెలిసి టిడిపికి యింత ఘోరమైన ఓటమి ఎన్నడూ కలగలేదు. 1994లో ఎన్టీయార్‌ టిడిపికి అత్యధిక సీట్లు తెచ్చిన రికార్డు సాధిస్తే 2019లో అత్యల్పమైన సీట్లు తెచ్చిన రికార్డు బాబు సాధించిపెట్టారు.

దీనికి కారణం – జగన్‌కు ఓ ఛాన్సిచ్చి చూద్దామని ఓటర్లు అనుకున్నారు అని చెప్పేయడం తేలిక. కానీ అంతకంటె ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన కారణం. లేకపోతే ముఖ్యమంత్రి కుమారుడితో సహా అనేకమంది మంత్రులు ఓడిపోయి వుండరు. మరి యీ వ్యతిరేకతను బాబు ఎందుకు పసిగట్టలేదనేదే ప్రశ్న. పసిగట్టి ఉంటే దిద్దుబాటు చర్యలు చేపట్టి ఉండేవారుగా! ప్రభుత్వానికి యింటెలిజెన్సు విభాగం ఉంటుంది, అది నివేదికలు యిస్తూనే ఉంటుంది. అయినా పాలకులు ఒక్కోసారి ఎందుకు ఓడిపోతూ ఉంటారంటే వాళ్లు యింటెలిజెన్సు చీఫ్‌లుగా యిచ్చకాలు పలికేవారినే నియమించుకుంటారు. వాళ్లు ఆహా, ఓహో అంటూ పబ్బం గడుపుకుని, వీళ్లను ముంచుతారు. 

బాబు విషయంలో ఆయన ఆ విభాగం మీద ఆధారపడవలసిన అవసరం లేదు. దాదాపు తెలుగు మీడియా అంతా ఆయనకు అనుకూలం. అనేక టీవీ ఛానెల్స్‌, రెండు ప్రధాన పత్రికలు ఆయన హితాన్ని కోరతాయి. వాళ్లకు ఊరూరా రిపోర్టర్లు ఉంటారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి. ఏ ఎమ్మెల్యే, ఏ జన్మభూమి కమిటీ సభ్యుడు, ఏ అధికారి ఎంతెంత మేసేస్తున్నాడు అనేది వాళ్లు తమ యాజమాన్యానికి చేరవేస్తూనే ఉంటారు. ఆ సమాచారాన్ని యీ మీడియా మోతుబరులు బాబుకి చెప్పలేదా? ముందుగా హెచ్చరించలేదా? హెచ్చరించినా యీయన నమ్మలేదా? బాబుతో ఒక యిబ్బంది ఏమిటంటే – తనకే అన్నీ తెలుసునని ఆయనకు గొప్ప నమ్మకం. ఎదుటివాళ్లు ఏదైనా చెప్పడానికి వస్తే, అది వినకుండా యీయనే గంటసేపు వాళ్లను ఊదరగొట్టి పంపిస్తాడు. అందుకని పార్టీ కార్యకర్తలెవరూ ఆయనతో నిష్కర్షగా మాట్లాడరు. చెప్పీ చెప్పనట్లుగా చెప్పి, హితబోధలు చేయించుకుని వెళతారు. 'నేను 18 గంటలు పని చేస్తున్నాను, మీరూ అలా పని చేసి పార్టీని నిలబెట్టాల' అనిపించుకోవడం దేనికని తలవూపి వెళ్లిపోతారు. పార్టీ క్యాడర్‌ సంగతి యిలా వున్నా కనీసం పత్రికాధిపతులైనా యీయనను మేల్కొల్పవలసినది.

ఇవాళ్టితో బాబు రాజకీయచరిత్ర ముగిసిందని అనుకోనక్కరలేదు. ఆయన ఫైటర్‌. మళ్లీ తంటాలు పడతాడు. కానీ వయసు ఆయన పక్షాన లేదు. వయసులో ఉన్న కొడుకు ఎక్కి రాలేదు. బభ్రాజమానం, భజగోవిందం అన్నట్లున్నాడు. వక్త కాదు సరికదా, నోరు విప్పకుండా ఉంటే మేలు అనిపిస్తాడు. అతనికి పార్టీ పగ్గాలు అప్పగించి, 'అతని నేతృత్వంలో మీరందరూ నడవండి, నేను వ్యూహకర్తగా ఉంటాను, ఉపయెన్నికలలో, స్థానిక ఎన్నికలలో మన బలాన్ని చాటుదాం' అని క్యాడర్‌తో అనే పరిస్థితి యింకా రాలేదు. ప్రతిపక్షంలో నుంచి అధికారపక్షానికి రావడం ఒక విధంగా సులువు. ఐదేళ్లు పాలించి, కుప్పలుతిప్పలుగా తప్పులు చేసి, ప్రజల చేత ఘోరంగా తిరస్కరించబడి మళ్లీ అధికారంలోకి రావడమంటే సులభమైన పని కాదు – జగన్‌ యీయన కంటె అధ్వాన్నంగా పాలిస్తే తప్ప! ఓటింగు శాతాలు బయటకు వచ్చి తెలుగుదేశం బలం ఎంత మిగిలి ఉందో గణాంకాలు తెలిస్తే తప్ప యింతకంటె ప్రస్తుతం ఏమీ వ్యాఖ్యానించలేము.
– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2019)
[email protected]