వయసు మీద పడింది, ఇకపై ఎంచక్కా మనవడితో ఆటలాడుకోవడమే బెటర్.! చంద్రబాబుకి సోషల్ మీడియా వేదికగా పడుతున్న పొలిటికల్ పంచ్‌లు ఇవి. ఎవరో అన్నారని కాదుగానీ, నలభయ్యేళ్ళపాటు రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఇకపై రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, హ్యాపీగా లైఫ్‌ని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడమే మంచిది. ఓడినా, ఓ 50 నుంచి 60 సీట్లు వస్తాయిలే.. అని చంద్రబాబు అనుకుని వుండొచ్చుగాక.
కానీ, పరిస్థితులు ఏమాత్రం చంద్రబాబుకి అనుకూలంగా కన్పించడంలేదు. 25 మార్క్ చేరుకోవడమే టీడీపీకి కష్టంగా మారింది అసెంబ్లీ సీట్ల పరంగా. లోక్‌సభ సీట్లపై దాదాపుగా ఆశలు వదిలేసుకున్నట్లే. అదృష్టం కలిసొస్తే ఒక్కటి గెలిచే ఛాన్స్ కన్పిస్తోంది టీడీపీకి. దీనర్థం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోనూ భూస్థాపితమైపోయిందని. తెలంగాణలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పాతరేసిన చంద్రబాబు, అదేపని ఆంధ్రప్రదేశ్‌లోనూ చేశారు.
నిజ్జంగా నిజమిది.. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచారు.. అదీ టీడీపీ అధినేతగా. గడచిన ఐదేళ్ళలో చంద్రబాబు రాష్ట్రాన్నీ, పార్టీనీ భ్రష్టుపట్టించిన వైనానికి ఇంతకన్నా గొప్ప ఫలితాలు ఎలా వస్తాయి.? 23 అసెంబ్లీ సీట్లు, ఓ ఎంపీ సీటు టీడీపీ గెలుచుకుందనే అనుకుందాం. 2014 ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ద్వారా వైసీపీకి ఇంతకన్నా ఎక్కువగానే చంద్రబాబు గండికొట్టారు. ఆ లెక్కన జగన్, రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటే ఏంటి పరిస్థితి.?
అయిపోయింది, తెలుగుదేశం పార్టీ కథ ముగిసిపోయింది. తెలుగునాట తెలుగుదేశం పార్టీ అంతర్థానమయిపోయింది. ఇది చంద్రబాబు స్వయంకృతాపరాధం. ఇందులో ఇంకోమాటకు తావులేదు. మే 30న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతకన్నా ముందే, చంద్రబాబు రాజకీయాలకు స్వస్థి చెప్పడమే మంచిదేమో.!