కేటీఆర్ సవారీకి త్వరలోనే రెండో గుర్రం!

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. త్వరలోనే జోడుగుర్రాల సవారీ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే పార్టీ బాధ్యతలతో తలమునకలుగా ఉన్న కేటీఆర్‌ను మంత్రిపదవి కూడా త్వరలోనే వరించనుంది. గత ప్రభుత్వంలో పూర్తికాలం మంత్రిగా ఉన్న…

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. త్వరలోనే జోడుగుర్రాల సవారీ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే పార్టీ బాధ్యతలతో తలమునకలుగా ఉన్న కేటీఆర్‌ను మంత్రిపదవి కూడా త్వరలోనే వరించనుంది. గత ప్రభుత్వంలో పూర్తికాలం మంత్రిగా ఉన్న కేటీఆర్- ఈదఫా ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిదశలో దక్కని కేబినెట్ అవకాశం… ఇప్పుడు దసరా నాటికి భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధం అవుతున్నారు. దసరానాటికి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేసీఆర్ కేబినెట్లో ప్రస్తుతానికి ఆరు ఖాళీలున్నాయి. కేబినెట్ నుంచి ఒకరిద్దరిని తొలగించడానికి కూడా ఆస్కారం ఉంది. ఈటెలను తొలగిస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఆయన ఒక్కడిమీదనే పనిగట్టుకుని వేటు వేశారనే ఇంప్రెషన్ పార్టీ శ్రేణుల్లో ఏర్పడకుండా.. మరొకరిని కూడా కలిపి కేబినెట్ నుంచి తొలగించినా ఆశ్చర్యంలేదు. మొత్తానికి ఆరు కంటె ఎక్కువ ఖాళీలనే భర్తీ చేయాల్సిన అవసరం రావొచ్చు.

అయితే ఉన్న ఖాళీలు తక్కువే అయినప్పటికీ.. వాటిని రెండుదశల్లో భర్తీ చేయడానికి కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తనయుడు కేటీఆర్‌కు మాత్రం మంత్రిపదవి గ్యారంటీ. అలాగే సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీగా రెండురోజుల కిందటే ప్రమాణం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా పదవి గ్యారంటీ. మిగిలిన పోస్టుల కోసం మాత్రమే అక్కడ పోటీ ఉంది.

ఈ కేబినెట్ లాంఛనం పూర్తయితే.. కేటీఆర్ కు జోడుగుర్రాల సవారీ అవుతుంది. పార్టీ మీద తిరుగులేని గుత్తాధిపత్యాన్ని తన వారసుడిగా కేటీఆర్ చేతిలో పెట్టడానికి కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడగానే.. కొడుకును, అల్లుడిని ఇద్దరినీ పక్కన పెట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ పగ్గాలు కొడుక్కి దక్కాయి. ఆరేడునెలలు గడిచాయి. ఇప్పుడు కేబినెట్ విస్తరణ ముహూర్తం వచ్చింది.

కేటీఆర్ కు కేబినెట్ పదవి అనేది కేవలం లాంఛనప్రాయమే అనడంలో సందేహం లేదు! ఆయన కేబినెట్ లో లేకపోయినా సరే.. సమస్త నిర్ణయాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయనే ప్రచారం ఉంది. మంత్రులు కూడా ఆయన సూచనల మేరకే వ్యవహారాలు నడిపిస్తున్నారు. సకల కార్యక్రమాల్లోనూ మంత్రులను మించిన ప్రాధాన్యం కేటీఆర్‌కు అన్ని రకాలుగా లభిస్తూనే ఉంది. లాంఛనమే అయినా.. మంత్రిపదవి ఒక హోదా గనుక.. ఇప్పుడు ఆయనను కేబినెట్లోకి తీసుకుంటున్నారు.

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!