Advertisement

Advertisement


Home > Politics - Gossip

కుండ బద్దలు కొట్టిన సుజన

కుండ బద్దలు కొట్టిన సుజన

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చాలా తక్కువసార్లు మీడియా ముందుకు వస్తారు. అందులోనూ పార్టీ విషయాల మీద ఆయన మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అలా అని తెలుగుదేశం పార్టీలో ఆయన పాత్ర విస్మరించలేనిది. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనపుడు, రాష్ట్రం విడిపోక ముందు ఆ పార్టీలో సుజనా చౌదరిది కీలకపాత్ర. తెరెవనుక మొత్తం కార్యక్రమాల నిర్వహణ ఆయనదే. ట్రబుల్ షూటర్ పాత్ర ఆయనదే. పార్టీకి ఆర్థిక పెట్టుబడులు ఆయనవే. ఆ కృషికి తగినట్లే ఆయన ఎంపీ అయ్యారు. కేంద్రంలో మంత్రి అయ్యారు.

కానీ తెలుగుదేశంలో లోకేష్ నాయుడు ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ సుజన పాత్ర తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసారు. మరోపక్క పలు ఆర్థిక నేరాల ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన మౌనంగా వుండిపోయారు. లేటెస్ట్ గా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాభవం పాలయిన తరువాత, ఆ పార్టీకి చెందిన కీలకనేత తొలిసారి ఇలా మాట్లాడడం ఇధే ప్రథమం. ఒక్క ప్రశ్నకు కూడా తొణకకుండా, బెణకకుండా సమాధానాలు ఇచ్చారు సుజన చౌదరి. తెలుగుదేశంలో వుంటూ, చంద్రబాబు అభిప్రాయాలు సరికావు, అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఏకైక నాయకుడు అనుకోవాలి.

మోడీ వల్ల భారతదేశానికి పేరు పెరిగింది అని చెప్పడం, మోడీ పొత్తు దూరం చేసుకోవడం సరికాదు అనడం, మోడీ, పవన్ గత ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి సాయం పట్టారని చెప్పడం, ఈసారి కూడా మోడీతో వుండి వుంటే కేక్ వాక్ అయ్యేదని చెప్పడం సుజనకే చెల్లింది.

అంతేకాదు, 2014లో అధికారంలోకి వచ్చిన ఆరునెలలకు పార్టీలో తన యాక్టివిటీ తగ్గిపోయిందని, అలాగే పార్టీలో ఇప్పుడున్న కోటరీలో తానులేనని, చంద్రబాబును తప్పుదారి పట్టించారని చాలా క్లియర్ గా చెప్పేసారు సుజనా చౌదరి. ఇదంతా చూస్తుంటే ఆయన భాజపాలోకి వెళ్తారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే అది కూడా ఆయన స్పష్టంచేసారు.

తను వెళ్లాలనుకుంటే చంద్రబాబుకు చెప్పే వెళ్తానని అన్నారు. మొత్తంమీద ఓ కీలకనేత గట్టిగానే కుండబద్దలు కొట్టారు. ఇంకా ఇలాంటివి ఎన్ని బద్దలవుతాయో చూడాలి.

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?