లోకేష్ సరే.. మీడియా బాధేంటీ?

''….వైఎస్ జమానాలో ఆంధ్రలో పరిశ్రమ పెట్టడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తను తనకు వాటా ఇవ్వాల్సిందే అని జగన్ వత్తిడి చేసారు. దాంతో ఆ పారిశ్రామిక వేత్త వెనక్కు వెళ్లిపోయారు…'' ''…ఓ నాయకుడు నాతో ఇలా…

''….వైఎస్ జమానాలో ఆంధ్రలో పరిశ్రమ పెట్టడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తను తనకు వాటా ఇవ్వాల్సిందే అని జగన్ వత్తిడి చేసారు. దాంతో ఆ పారిశ్రామిక వేత్త వెనక్కు వెళ్లిపోయారు…''
''…ఓ నాయకుడు నాతో ఇలా అన్నారు….''
''…ఒక ఐఎఎస్ అధికారి ఇలా కామెంట్ చేసారు…'

పైన పేర్కొన్న వాక్యాలు అనేకసార్లు ఓ మీడియాలో, ఆ మీడియా అధిపతి వారం వారం రాసే కాలమ్ లో దొర్లినవే. వీటిని ఏమంటారు? గ్యాసిప్ లు అంటారా? మరేం అంటారు. కాలమ్ వేరు, గ్యాసిప్ వేరు, వార్త వేరు, సమాచారం వేరు. ఇదంతా జర్నలిజమ్ వ్యవహారం. అయితే ఇప్పుడు ఏ మీడియా అయినా దేనిమీద బతుకుతోంది? గ్యాసిప్ల మీద కాదా? కేవలం సమాచారం మాత్రమే అందిస్తోందా? ఏ  మీడియా అయినా?

వార్తను లేదా సమాచారాన్ని, కామెంట్ ను జోడించకూడదని, దేనికి అది విడిగా అందివ్వాలని జర్నలిజమ్ సూత్రాలు చెబుతున్నాయి. కానీ తెలుగునాట ప్రధాన ప్రింట్ మీడియాలు ఈ సూత్రాన్ని ఏనాడో తుంగలో తొక్కేసాయి. అసలు వార్త స్టార్ట్ చేయడమే కామెంట్ తో స్టార్ట్ చేసి, సమాచారం జోడించడం కామన్ అయిపోయింది.

సరే, మళ్లీ మొదటి వచ్చి పైన కొట్ చేసిన వాక్యాలు చూద్దాం. కాలమిస్ట్ అనేవాళ్లు గ్యాసిప్ లు రాయకూడదు. అందులోనూ కామెంట్ కాలమిస్ట్ లు తమ స్వంత వ్యాఖ్యానం ఇవ్వాలి తప్ప, ఎవరో అన్నారు. ఎవరో అన్నారట.. అనే గ్యాసిప్ ను ఇవ్వకూడదు. కానీ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ఆ మీడియా కాలమ్ లో కామెంట్ కన్నా గ్యాసిప్ లే ఎక్కువ కనిపిస్తుంటాయి.

సరే, అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చినట్లు మీడియా సమాచార వ్యవస్థలోనూ మార్పులు వచ్చాయి. సమాచారం అన్నదాని కన్నా గ్యాసిప్ అన్నదే పాఠకులకు రుచించడం ప్రారంభమైంది. ఈ రోజున గ్యాసిప్ ప్రచురించని మాధ్యమం వుందా? ఈ ప్రశ్న ఏ మాధ్యమం అయినా తనకు తాను వేసుకోవచ్చు.

విజువల్ మీడియా ఏం చేస్తోంది? గ్యాసిప్ ల ప్రసారం చేయడం లేదా? రోజల్లా గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్ మీడియా అందించే గ్యాసిప్ లను సాయంత్రానికి ఆవురావురుమంటూ తీసుకుని, క్యాప్సూల్ చేసుకుని వేసుకోవడం లేదా? దీనికి ఎన్ని రుజువులు సాక్ష్యాలు కావాలి? రోజల్లా గ్రేట్ ఆంధ్ర ఇచ్చే గ్యాసిప్ లను పరాన్నజీవుల మాదిరిగా తీసుకుని, ప్రసారం చేసుకునే మాధ్యమాలు ఎన్ని లేవు?

దీనికి రుజువులు కావాలా? సరే విజువల్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, వెబ్ మీడియా అయినా గ్యాసిప్ లే జీవనాధారంగా మారిపోయాయి రోజులు. కాలమాన పరిస్థితులు అవి. ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ సాహో సినిమాకు సంబంధించి గ్రేట్ ఆంధ్ర ప్రచురించిన ఓ వార్త తెలుగుదేశం యువనాయకుడు లోకేష్ బాబుకు రుచించలేదు. అలా రుచించకపోవడం తప్పేంకాదు.

ఆయన ఓ ట్వీటు వేసారు. ఇలాంటి సంపాదనతో తింటున్నారా? అని కానీ ఆయన ఇదే ప్రశ్న ఆయనకు, ఆయన పార్టీకి కొమ్ముకాస్తూ, వైకాపాకు, జగన్ కు వ్యతిరేకంగా గ్యాసిప్ లు వండి వారుస్తున్న అనేకానేక మాధ్యమాలను కూడా గతంలో ఒకసారి అయినా అడిగివుంటే మరింత బాగుండేది. అప్పుడు అమృతాన్నంలా రుచిగా అనిపించింది. ఇప్పడు కాకరకాయ కూర మాదిరిగా చేదుగా వుంది.

సరే లోకేష్ విషయంలో ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. క్షత్రియులకు-కమ్మవారికి మధ్య వైరం పెడుతున్నారంటూ కొన్ని మీడియాలు పెడార్థం తీయడం మొదలు పెట్టాయి. ఆ మాటకు వస్తే సత్యం రామలింగరాజును వైఎస్ జగన్ కొట్టాడు అనే గ్యాసిప్ ను 2014 ఎన్నికల టైమ్ లో ఎవరు ప్రచారం చేసారు?

ఎందుకు 2014 టైమ్ లో పశ్చిమగోదావరిలో వైకాపా విజయావకాశాలను దెబ్బ తీయడం వెనుక ఈ గ్యాసిప్ వుందన్నది వాస్తవమా? కాదా? అప్పుడు ఎందుకు ఖండించలేదు ఎవ్వరూ? అంటే తెలుగుదేశం పార్టీకి పనికి వస్తుంది కాబట్టి ఆనందంగా అనిపించి వుంటుంది.

సరే, మళ్లీ లోకేష్ విషయాన్ని పక్కన పెడదాం. లోకేష్ ట్వీట్ ను పట్టుకుని, అర్జెంట్ గా గ్రేట్ ఆంధ్ర మీద చెలరేగిపోదాం అనుకునే మీడియా సంస్థలు ఏమన్నా మడిగట్టుకుని కూర్చున్నాయా? ట్విట్టర్ లో వాటి ఫాలోవర్లు ఈ విషయంలో వాటిని ఏ విధంగా తూర్పారపడుతున్నాయో? ఓసారి చూసుకుంటే తెలుస్తుంది. ఎన్నికల టైమ్ లో, ఇప్పుడు కూడా లోకేష్ కో, తెలుగుదేశం పార్టీకో బాకా ఊదిన, ఊదుతున్న సంగతి, అందుకోసం సవాలక్ష గ్యాసిప్ లు వండి వారుస్తున్న సంగతి మర్చిపోతే ఎలా?

మీరు తింటే ఫలహారం, వేరేవాళ్లు తింటే చిరుతిళ్లు అనుకుంటె ఎలా? ముందు మన ఇంట్లో ఏం జరుగుతూందో? మనమేం చేస్తున్నామో చూసుకుని, అవతలి ఇంటి ముచ్చట్లపై కామెంట్ చేస్తే బెటర్.

పులిని చూస్తే పులి ఎన్నడు జడవదు. మేక వస్తే మేక ఎన్నడు అదరదు. మాయరోగమదేమో కానీ మనిషి మనిషికి కుదరదు అన్నాడు వెనకటికి ఓ కవి. ఇప్పుడు మనిషి అన్న దగ్గర మీడియా అని పెట్టుకోవాలేమో?

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!