బాబుపై ప్ర‌తీకారం తీర్చుకున్న లేడీ సీఎం!

అబ్దుల్‌క‌లాంను రాష్ట్ర‌ప‌తి చేసిన ఘ‌న‌త త‌న‌దే అని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. అలాగే ఎంతో మంది రాష్ట్ర‌ప‌తుల ఎంపిక‌లో తాను కీల‌క పాత్ర పోషించాన‌ని చంద్ర‌బాబు చెబితే టీడీపీ నేత‌లు కోర‌స్ ప‌లికే వారు.…

అబ్దుల్‌క‌లాంను రాష్ట్ర‌ప‌తి చేసిన ఘ‌న‌త త‌న‌దే అని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. అలాగే ఎంతో మంది రాష్ట్ర‌ప‌తుల ఎంపిక‌లో తాను కీల‌క పాత్ర పోషించాన‌ని చంద్ర‌బాబు చెబితే టీడీపీ నేత‌లు కోర‌స్ ప‌లికే వారు. ఢిల్లీలో ఒక‌ప్పుడు బొంగ‌రాలు, విష్ణు చ‌క్రాలు తిప్పిన చంద్ర‌బాబును ఇప్పుడు జాతీయ స్థాయిలో ప‌ట్టించుకునే దిక్కులేదు? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. 

నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి రాజ‌కీయ చ‌రిత్ర‌, సుదీర్ఘ కాలం పాటు పాల‌నానుభ‌వం ఉన్న చంద్ర‌బాబు అనే నాయ‌కుడొక‌రున్నార‌ని జాతీయ నాయ‌కులు మ‌రిచిపోయిన‌ట్టున్నారు. అస‌లు టీడీపీ అనే ఒక బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీ ఉంద‌నే సంగ‌తి జాతీయ నేత‌ల‌కు గుర్తు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

'ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయిస‌ అనే సామెత చంద్ర‌బాబు తాజా రాజ‌కీయ ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక కోసం ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ నేతృత్వంలో బుధ‌వారం ఢిల్లీలో విప‌క్షాల మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్‌కు 17 పార్టీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. మొత్తం 22 పార్టీల‌ను ఆహ్వానించిన‌ట్టు మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌క‌టించారు. నిజానికి ముందు ప్ర‌క‌టించిన జాబితాలో వైసీపీ లేదు. ఒక్క టీఆర్ఎస్ మాత్రం వుంది.

అయితే స‌మావేశం ముగిసిన త‌ర్వాత వైసీపీని ఆహ్వానించిన‌ట్టు ఓ లేఖ తెర‌పైకి రావ‌డం విశేషం. ఈ నెల 11న జ‌గ‌న్‌కు లేఖ రాసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. “మ‌న దేశ ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు బ‌ల‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌తిప‌క్షం అవ‌స‌రం. ఈ రోజు దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న విభ‌జ‌న శ‌క్తుల్ని అడ్డుకోడానికి అన్ని ప్ర‌గ‌తిశీల పార్టీలూ క‌లిసిక‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నెల 15న రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక కోసం మీరు రావాలి” అని జ‌గ‌న్‌కు మ‌మ‌తాబెన‌ర్జీ ఆహ్వానం పంపడం విశేషం.

జాతీయ పార్టీ పెడ‌తాన‌ని చ‌ర్చోప‌చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నతెలంగాణ సీఎం కేసీఆర్‌ విప‌క్షాల మీటింగ్‌కు గైర్హాజ‌ర‌య్యారు. ఆ మ‌ధ్య ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లి మ‌మ‌త‌తో కేసీఆర్ బృందం స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. దేశంలో మోదీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్యా మ్నాయ కూట‌మి ఏర్పాటుపై కేసీఆర్ చ‌ర్చించి వ‌చ్చారు. అలాగే మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క త‌దిత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి కేసీఆర్ ప‌లు పార్టీల నేత‌ల‌తో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయ కార‌ణాల‌తో మ‌మ‌త భేటీకి వెళ్ల‌లేద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు ఆహ్వానం రావ‌డం విశేష‌మే. ఎందుకంటే మ‌మ‌త‌తో జ‌గ‌న్ ఎప్పుడూ స్నేహంగా మెల‌గ‌లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మ‌మ‌త‌తో క‌లిసి చంద్ర‌బాబు జాతీయ స్థాయిలో చేసిన రాజ‌కీయాలు అంద‌రికీ తెలిసిందే. మోదీని చంద్ర‌బాబు తిట్ట‌ని తిట్టు లేదు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యంపాలు కావ‌డంతో చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకుంది. మోదీపై విమ‌ర్శ మాటేలేదు. మ‌మ‌త ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేనంత‌గా చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారు. దీంతో చంద్ర‌బాబు నైజం తెలిసిన మ‌మ‌తాబెన‌ర్జీ ఆయ‌న‌పై మండిప‌డుతున్నార‌ని స‌మాచారం.

అందుకే జ‌గ‌న్‌ను ఆహ్వానించి, చంద్ర‌బాబు స్థాయి ఏంటో చెప్ప‌డానికి మ‌మ‌త ప‌న్నిన వ్యూహంగా రాజ‌కీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్ర‌బాబు ప్ర‌తిష్ట పూర్తిగా మ‌స‌క‌బారింద‌నే సంకేతాలు పంప‌డానికే ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆహ్వానం పంప‌లేద‌ని స‌మాచారం. ఈ విధంగా బాబుపై మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌తీకారం తీర్చుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.