కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీ చేర్చుకోబోతోందనే వార్త ఖరారు అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పై వీర విధేయతను ప్రకటిస్తూ వచ్చని శశిధర్ రెడ్డి ఇలా ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయిస్తున్నారు. అది కూడా ఈ వయసులో! మంచో చెడో.. కనీసం కాంగ్రెస్ వాదిగా నిలబడ్డారు అనే ఖ్యాతిని కూడా శశిధర్ రెడ్డి మిగుల్చుకోదలిచినట్టుగా లేరు!
మర్రి చెన్నారెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శశిధర్ రెడ్డి చెట్టుపేరును నిలబెట్టుకోలేకపోయారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గినప్పటికీ.. తండ్రికి తగ్గ రాజకీయ నేత కాలేకపోయారు. సీఎంల తనయుల్లో ఫెయిల్యూర్ పొలిటీషియన్లలో ఒకరిగా నిలిచారు శశిధర్ రెడ్డి. పార్టీ హవా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గడం, ముఖ్యమంత్రులుపై అలకబూనడం, తను కూడా సీఎం అభ్యర్థిని అనేంత హంగామా చేయడం శశిధర్ రెడ్డికి సాధ్యమైంది కానీ, ఆ మేరకు ఉనికి మాత్రం చాటుకోలేకపోయారు. విజయాలు సాధించలేకపోయారు.
1992 ఉప ఎన్నికల్లో తొలిసారి ఈయన ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తర్వాత 1995 ఎన్నికల్లో నెగ్గారు. 99లో ఓడిపోయారు. వైఎస్ఆర్ హవాలో 2004, 2009లలో శశిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే మొదట్లోనే వైఎస్ వ్యతిరేక శిబిరమన్నారు. హైదరాబాద్ బ్రదర్స్ గా అప్పట్లో పీజేఆర్, శశిధర్ రెడ్డిలు వైఎస్ వ్యతిరేక రాజకీయాలు షురూ చేశారు. పీజేఆర్ హఠాన్మరణంతో శశిధర్ రెడ్డికి ఊపు లేకుండాపోయింది.
ఇక కాంగ్రెస్ అధినేత్రిగా వ్యవహరించిన సోనియాకు అత్యంత విధేయుడిగా మిగిలారు. అయితే జనాదరణ మాత్రం పొందలేకపోయారు. 2014 ఎన్నికల్లో శశిధర్ రెడ్డి చిత్తుగా ఓడిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో శశిధర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు! తన తండ్రి, తను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో పోటీ చేసి.. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కన్నా తక్కువ ఓట్లను పొందారు. 22 వేల ఓట్ల ను పొంది మూడో స్థానంలో నిలిచారు శశిధర్ రెడ్డి. ఆ తర్వాత మళ్లీ ఈయన ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపించింది లేదు.
కాంగ్రెస్ హయాంలో సోనియాను కాకా పట్టి కేంద్రంలో ఏదో నామినేటెడ్ పదవిని కూడా సంపాదించారు. బీజేపీ వాళ్లు వచ్చాకా ఆ హోదా నుంచి తప్పించారు. మరి ప్రజాదరణ కోల్పోయిన, రాజకీయంగా ఉనికి లేని శశిధర్ రెడ్డి ని చేర్చుకుని బీజేపీ సాధించేది ఏమిటో!