అక్కడ భవిష్యత్తు లేదు.. ఇక్కడ ఛాన్సు లేదు!

రాష్ట్రంలో అగ్రపథంలో ఉన్న రెండుపార్టీల కంటె.. శవాసనం వేసి ఉన్నప్పటికీ… మూడో పార్టీనే మేలని రాజంపేట మాజీ ఎంపీ సాయిప్రతాప్ కు అనిపించినట్లుగా ఉంది. నిజానికి ఆయన నిర్ణయం చిత్రమే! వైఎస్సార్ తో అప్పట్లో…

రాష్ట్రంలో అగ్రపథంలో ఉన్న రెండుపార్టీల కంటె.. శవాసనం వేసి ఉన్నప్పటికీ… మూడో పార్టీనే మేలని రాజంపేట మాజీ ఎంపీ సాయిప్రతాప్ కు అనిపించినట్లుగా ఉంది. నిజానికి ఆయన నిర్ణయం చిత్రమే! వైఎస్సార్ తో అప్పట్లో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎంచుకోవచ్చునని కొందరు భావించవచ్చు గానీ.. సాయిప్రతాప్ కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నారు.

గత 2014 ఎన్నికల్లో సిటింగ్ ఎంపీగా ఉంటూ కాంగ్రెస్ నుంచి పోటీచేసి పరాభవం చెందిన తర్వాత.. సాయిప్రతాప్ చాలాకాలం మిన్నకుండిపోయారు. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. ఏదో ఒరగబెట్టేస్తుందని అనుకుని తెలుగుదేశంలో చేరారు. ఎన్నికల సీజన్ వచ్చిన తర్వాత గానీ.. ఆయనకు తెలుగుదేశం అసలు రంగు తెలియలేదు. ఆయనకు టికెట్ నిరాకరించాక, తెలుగుదేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి దాకా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా ప్రకటన వెలువడింది.

తెలుగుదేశం పార్టీలో తనకు భవిష్యత్తు లేదని అనుకున్నారో.. తెలుగుదేశం పార్టీకే భవిష్యత్తు లేదని అనుకున్నారో తెలియదు. ఆయన రాజకీయ ఉన్నతికి వైఎస్సార్ అండగా నిలిచిన వైనం తెలిసిన వాళ్లు… ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఉండాల్సిందని అనుకుంటారు. కానీ అక్కడినుంచి ఎంపీగా జగన్ కు సన్నిహితుడైన మిథున్ రెడ్డి ఉండగా, రాజంపేటలో తనకిక అవకాశం ఉండదని సాయిప్రతాప్ భావించి ఉంటారు.

పార్టీ ఛాన్సు ఇవ్వకపోయినా సరే.. వైఎస్ పట్ల కృతజ్ఞతతో పార్టీలో ఉండి.. పదవులు ఆశించని పార్టీ సేవకు ఆయన పరిమితమై ఉంటే బాగుండేదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ సాయిప్రతాప్ మాత్రం వెరైటీగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అస్తిత్వంలో లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ తనకు టికెట్ నిరాకరించిన చంద్రబాబునాయుడు మోచేతి నీళ్లు తాగడం మీదనే ఆశపడుతున్నప్పటికీ సాయిప్రతాప్ ఎందుకు ఆ పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్తు గురించి కలగంటున్నారో అర్థంకాని సంగతి.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!