వైసీపీ అభ్యర్థులకు దీటైన వారిని బరిలో దింపేందుకు టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీకి చెందిన వివిధ సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు నివేదికలను అధిష్టానానికి అందజేస్తున్నాయి. ఈ దఫా రాయలసీమలో ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో టీడీపీ వుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. బలహీన నాయకత్వం ఉన్న చోట ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తోంది.
ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఇక్కడ బత్యాల చెంగల్రాయులు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో మేడా మల్లిఖార్జున్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బత్యాలకు బదులు మరొకరిని బరిలో నిలపడానికి టీడీపీ కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం వైసీపీలో వుంటున్న ఒక ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన వ్యాపారవేత్తను బరిలో నిలపడానికి చర్చలు జరిపినట్టు తెలిసింది. మంగంపేట మైన్స్ వ్యాపారంలో కూడా ఉంటున్న సదరు వైసీపీ ప్రజాప్రతినిధి సమీప బంధువులు ప్రస్తుతం అమెరికా, బెంగళూరులలో వుంటున్నారు. వ్యాపార రంగంలో వుంటున్న సదరు కుటుంబానికి చెందిన యువకుడు… టీడీపీ యువ నాయకుడు లోకేశ్‌తో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు.
పార్లమెంట్ కేంద్రమైన రాజంపేటకు జిల్లా ఇవ్వలేదనే కోపం ఆ నియోజకవర్గ ప్రజల్లో వుంది. దీంతో వైసీపీపై వ్యతిరేకత వుందని, టీడీపీ నుంచి గెలుపు సులువనే లెక్కల్లో యువ వ్యాపారవేత్త ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజంపేటలో ఎన్ఆర్ఐ అభ్యర్థి బరిలో వుంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.