Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

తను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానంటూ గట్టిగా చెప్పిన రోజుల్లో కోట్ల జయసూర్య ప్రకాష్‌ రెడ్డి ఒక వ్యాఖ్య చేసేవారు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీని వీడేది ఉండదని చెబుతూ.. 'కాంగ్రెస్‌ పార్టీని వీడటం అంటే రాజకీయంగా రిటైర్మెంటే.. రాజకీయాల నుంచి వైదొలిగినట్టే..' అని పదే పదే జయసూర్య ప్రకాష్‌ రెడ్డి చెప్పేవారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో భవితవ్యం లేదని తేలిన తర్వాత సూర్య ప్రకాష్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరబోతారని, కాదు ఆయన తెలుగుదేశంలోకి చేరతారంటూ వివిధ వార్తలు వచ్చాయి.

అలాంటి సమయంలో ఆయన స్పందిస్తూ తను కాంగ్రెస్‌ను వీడేది ఉండదంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లడం అంటే రాజకీయాల నుంచి వైదొలిగినట్టే అని స్పష్టంచేశారు. అన్నిమాటలు చెప్పిన కోట్ల చివరకు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కోట్ల తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఆయన అనుచరులే ఖిన్నులను చేసింది. 'ఇంత బతుకూ బతికి.. తెలుగుదేశంలోకి చేరడమా..' అనేభావన వారిలో ఎక్కువగా కనిపించింది.

అయితే వారందరికీ సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేసి రాజకీయ ఉనికి కోసం కోట్ల తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మరి ఇప్పుడు ఆయన గెలుస్తారా? అనేది ఇంకా మిస్టరీనే. అందరి విజయాలూ ఇంకా మిస్టరీనే కానీ, కోట్ల గెలుపు సాధ్యంకాదనే విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉండటం విశేషం.

జయసూర్య ప్రకాష్‌ రెడ్డికి సైకిల్‌ గుర్తు మీద విజయం సాధ్యం అయ్యేలా లేదని... ఓటింగ్‌ ఆ తరహాలో జరిగిందని విశ్లేషిస్తున్నారు కొంతమంది. దశాబ్ధాల వైరాన్ని పక్కనపెట్టి కోట్ల తెలుగుదేశంలో అయితే చేరారు కానీ.. జనాలు అలా అభిమానాలను చంపుకోలేకపోయారని.. కోట్ల అనుచవర్గం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేకపోగా, కోట్ల వైరివర్గాలు కూడా ఆయనకు ఓటు వేయలేదనే మాట వినిపిస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోట్ల పోటీచేస్తే ఏకంగా లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే అలాంటి ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు కోట్లకు దూరం అయ్యిందని. ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరడం కన్నా సోలోగా నిలబడితేనే బావుంటుందనేది ఆ అనుచరవర్గం అభిప్రాయం అని అంటున్నారు.

ఎన్నికల ముందు తెలుగుదేశంలోకి కొత్తగా చేరిన కోట్లకు అక్కడ కుదురుకోవడానికి పెద్దగా సమయం కూడా దొరకలేదని.. ఏతావాతా ఆయనకు అక్కడ పరిణామాలు కలిసి రాలేదని పరిశీలకులు అంటున్నారు. వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చి కోట్లను, తెలుగుదేశం పార్టీని మరింత ఇరకాటంలో పెట్టిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముందుగా కోట్ల చెప్పినట్టుగా కాంగ్రెస్‌ పార్టీని వీడటం అంటే.. అది రాజకీయంగా తను రిటైర్మెంట్‌ తీసుకున్నట్టే.. అనేమాట ఇప్పుడు కూడా నిజం అయ్యేలా ఉందని, కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరిన కోట్ల ఇక రిటైర్డ్‌ అయినట్టే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి అసలు కథ ఎలా ఉంటుందనేది మే ఇరవైన తెలియాల్సిందే!

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?