అప్పట్లో రాజధాని గురించి కబుర్లు చెప్పడంలో చంద్రబాబు తర్వాతి పాత్ర ఆయనదే.. రాజధాని కమిటీ అంటూ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ట్రూపులోనూ ఆయనదే ముఖ్యపాత్ర! అంతేనా.. రాజధాని నిర్మాణంపై అధ్యయనం అంటూ ప్రపంచమంతా తిరిగిన వారిలో కూడా ఆయనే ముందున్నారు. అప్పట్లో రాజధాని అంటే ఆయన, ఆయన అంటే రాజధాని అనే హడావుడి సాగింది. ఆయన మరెవరో కాదు నాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ!
అమరావతి విషయంలో బాగా హడావుడి చేసిన వ్యక్తి నారాయణ. ఆయనకు ఎన్ని రాజధానులు కట్టిన అనుభవం ఉందో కానీ.. ఆ విషయంలో బాధ్యతలన్నీ ఆయనకే అప్పగించారు చంద్రబాబు నాయుడు! హైదరాబాద్ కట్టిన మేస్త్రీగా తనను తాను చెప్పుకునే చంద్రబాబు నాయుడు, తన కింది ముఠామేస్త్రీగా నారాయణకు అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నారు.
ఇప్పుడు రాజధాని విషయంలో తెలుగుదేశం గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ గగ్గోలు ప్రజలకు పట్టడంలేదు. రాజధాని అక్కడ ఉన్నా తమకు లాభం లేదన్నట్టుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ఏరియాలో తెలుగు తమ్ముళ్లు భారీగా కొనుగోలు చేసిన భూముల విలువ పడిపోకుండా ఉండటానికే లోకేష్ రంగంలోకి దిగారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరి లోకేష్ రంగంలోకి దిగినా.. నారాయణ మాత్రం బయటకు రావడంలేదు. అప్పుడు రాజధాని గురించి నానా హడావుడి చేసి ఇప్పుడు నారాయణ కామ్ గా ఉన్నారు. ఇప్పుడు కాదు.. తెలుగుదేశం అధికారం కోల్పోగానే నారాయణ తెరమరుగు అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతానంటూ కూడా ఆయన వర్తమనాలు పంపించారట.
ఇటు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నారాయణ సైలెంట్ అయిపోయి, ఇప్పుడు ఏం మాట్లాడితే ఏది తనకు చుట్టుకుంటుందనే లెక్కలతో బయటకే రావడంలేదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి సామాన్య ప్రజానీకం నుంచి.