తెలుగుదేశం పార్టీ క్రమంగా కోస్తా పార్టీగా మిగిలిపోతూ ఉంది. రాయలసీమలో ఆ పార్టీ గత ఎన్నికల్లో అత్యంత చేదు ఫలితాలను ఎదుర్కొన్న అనంతరం, ఆ ప్రాంతంపైనే గాక ఆ ప్రాంత నేతలను కూడా చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే అమరావతి పై అతిగా స్పందించి రాయలసీమలో మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంది తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో 52 సీట్లకు గానూ మూడంటే మూడు సీట్లలో నెగ్గి తెలుగుదేశం పార్టీ చిత్తయ్యింది. రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన వాటి విషయంలోనే అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు తను చేసిన అన్యాయమే రైటు అనే వాదన వినిపిస్తూ ఉన్నారు. దీంతో సీమలో టీడీపీ పునాదులను కూడా కోల్పోతూ ఉంది.
ఇక నేతల విషయానికి వస్తేపరిట.. చాలా మంది స్తబ్ధుగా మారిపోయారు. జనం మధ్యకు వచ్చే నేత ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. నాలుగు జిల్లాల పరిధిలో యాక్టివ్ గా తిరుగుతున్న తెలుగుదేశం నేత ఎవరు? అంటే టీడీపీ శ్రేణులే సమాధానం చెప్పలేకపోతున్నాయి.
కొందరికి సొంత వ్యవహారాలను సరిపెట్టుకోవడమే సరిపోతోంది. మరి కొందరు తమకెందుకు వచ్చిందన్నట్టుగా కామ్ గా ఉన్నారు. ఆఖరికి నారా లోకేష్ బాబు ఆ మధ్య అనంతపురం వస్తే ఆయనను వెళ్లి కలిసిన నేతలు కూడా తక్కువ మందే అంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు.
ఈ పరిస్థితుల్లో టీడీపీలోని కొందరు పాత కాపులు కూడా ఇప్పుడు స్పందించడం లేదు. ఆ విషయంలో పరిటాల కుటుంబ ప్రస్తావన వస్తూ ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లా అంతా తమదే అన్నట్టుగా పరిటాల కుటుంబం చెప్పుకొచ్చేది.
రాప్తాడు, పెనుకొండ, ధర్మవరం ఇదంతా తమకు పట్టున్న ప్రాంతమంటూ పరిటాల సునీత ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ధర్మవరం నియోజకవర్గం రెస్పాన్సిబులిటీ తమకు ఇవ్వాలంటూ కూడా ఆమె గతంలో చంద్రబాబును కోరారు. అదంతా అధికారంలో ఉన్నప్పటి కథ.
అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడే ధర్మవరం బాధ్యతలను పరిటాల ఫ్యామిలీకి ఇచ్చారు. అయితే వాళ్లు మాత్రం రాప్తాడు నియోజకవర్గం బాధ్యతలను కూడా గాలికి వదిలినట్టుగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. రాప్తాడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీకి గట్టి ఝలక్ తగిలింది.
తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసి చిత్తయ్యాడు పరిటాల శ్రీరామ్. అలా వారి కంచుకోట బద్ధలు కావడంతో.. కథ మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిటాల ఫ్యామిలీ రాజకీయంగా చాలా కామ్ అయిపోయింది. ఎలాంటి యాక్టివిటీస్ లేవు. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో జనాన్ని తమ వైపుకు తిప్పుకుంటుంటే… టీడీపీ వాళ్లు మాత్రం ఇళ్లకు పరిమితం అయిన నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి.
ఇక ధర్మవరంలో గత టర్మ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండిన వరదాపురం సూరి తనకాంట్రాక్టులు, బిల్లుల కోసం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పరిటాల ఫ్యామిలీకి ధర్మవరం బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు.
రాప్తాడులోనే నిమ్మకు నీరెత్తిన పరిటాల ఫ్యామిలీ, ధర్మవరం గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇక పార్టీ నియామకాలు, కమిటీల్లో కూడా పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రాధాన్యతనూ ఇవ్వలేదు. ఈ పరిణామాల్లో ఇంతకీ పరిటాల కుటుంబం టీడీపీలో ఉన్నట్టా, లేక రాజకీయ సన్యాసం తీసుకున్నట్టా? అనేంత స్థాయిలో సందేహాలు తలెత్తుతుండటం గమనార్హం!