‘చుట్టూపక్కల చూడరా చిన్నవాడా.. చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా…’ పాట చాలా గొప్పది. ఎంతో అర్థవంతంగా ఉంటుంది. సందేశాత్మకంగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి మాస్ చిత్రాల ఒరవడిలో కొట్టుకుపోతూ… అవార్డులు పొందగల అభినయం తెలిసిన హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చేసిన చిత్రం ఇది. దానికి తగ్గట్టుగానే ఆయన కాస్త అవార్డుల పరంగా గుర్తింపు పొందారు. చిత్రానికి మంచి పేరే వచ్చింది. అయితే ఆదర్శాలను ముందుగా ప్లాన్ చేసుకుని.. వాటికి అనుగుణంగా కథను తమకు తోచినట్లుగా వండుకుని.. తయారుచేసిన సినిమా అది. బాక్సాఫీసు వద్ద మాత్రం దారుణంగా ఫ్లాపయింది. ఆ సీజన్లో చిరంజీవికి కనీ వినీ ఎరుగనంత ఫ్లాప్ అది.
ప్రజలు ఎప్పుడూ చాలా తెలివైన వాళ్లు! మేధావులు అని తమను గురించి తాము అనుకునే వాళ్లు అంచనా వేయడానికంటె ప్రజలు ఎప్పుడూ భిన్నంగా, వారికి అందకుండా ప్రవర్తిస్తారు. అందుకే ఆ రుద్రవీణ ఫ్లాపయింది. ఇన్నాళ్లకు మళ్లీ ఆ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తున్నదంటే.. కారణం పవన్ కల్యాణ్. జగన్ సర్కారును తిట్టిపోయడానికి.. కొత్త ట్వీట్లు పెడుతూ.. ‘రుద్రవీణ’ చిత్రం తనకు చాలా ఫేవరెట్ సినిమా అని పవన్ సెలవిచ్చారు.
పవన్ కల్యాణ్ జనసేన కూడా రుద్రవీణ సినిమాలాంటిదే. ఆయన చెప్పే ఆదర్శాలు, ప్రవచనాలు అన్నీ కూడా పొద్దున్నే వాట్సప్ లో వందలు వేలుగా దర్శనమిచ్చే ఉపదేశాల్లాగా చాలా చక్కగా ఉంటాయి. ప్రజలందరూ కూడా చాలా బాగా చప్పట్లు కొడతారు. కానీ.. వాటిని నమ్మరు. నమ్మేంత అవకాశం ఆయన ఇవ్వడం లేదు. అందుకే పవన్ కల్యాణ్ నిర్వహించిన రాజకీయ సభలు ఎంత రంజుగా జరిగినా, సభలకు జనం ఎలా వచ్చినా, యీలలు వేసినా.. ఓట్లు మాత్రం రాలలేదు. ఆయన స్వయంగా రెండు నియోజకవర్గాల్లో దారుణంగా ఓడిపోయారు. రుద్రవీణను అందరూ కీర్తించి బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ చేసినట్టే.. జనసేన ఆదర్శాలను కూడా అందరూ శ్లాఘించి.. బ్యాలెట్ బాక్స్ వద్ద ఓడగొట్టారు. చూడబోతే.. పవన్ కల్యాణ్ తన ఫేవరెట్ సినిమాను సరిగ్గానే ఎంచుకున్నారని అనిపిస్తోంది.
జగన్ ను తిట్టిపోయడానికి పవన్ మరో పాటను కూడా ఉదాహరించారు. ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని.. కమ్ముకు వచ్చిన ఈ మాయని..’ అంటూ అదే చిత్రంలోని పాటను ట్వీట్ చేశారు. ఆ పాటలో కంటెంట్ నిజమే. కానీ.. జగన్ ప్రభుత్వానికి దానికి సామ్యం లేదు. ఎందుకంటే.. జగన్ పాలన అనేది తనంతగా అది ‘రేయి’లాగా కమ్ముకు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వరించి, వలచి, ఆమోదించి దానిని కార్యరూపంలోకి తీసుకువచ్చారు. ప్రజల ఇష్టం అది. పవన్ కు నచ్చకపోవచ్చు. కానీ.. ఆ పాలన కోరుకున్న ప్రజలు.. దాని వలన ఆశించిన ప్రయోజనాలు పొందుతున్నారని ఆయన తెలుసుకోవాలి.