భారం దించుకున్న పవన్ కల్యాణ్

ఇక ఇబ్బందేమీ లేదు. ఇన్నాళ్లూ సాగుతూ వచ్చిన ముసుగులో గుద్దులాట పర్వానికి తెరపడిపోయింది. విలీనం అనే మంత్రం ఒక్కటే పపన్ కల్యాణ్ పఠించలేదు. ఎంచక్కా.. భారతీయ జనతా పార్టీ చంక ఎక్కి కూర్చున్నారు. వారితో…

ఇక ఇబ్బందేమీ లేదు. ఇన్నాళ్లూ సాగుతూ వచ్చిన ముసుగులో గుద్దులాట పర్వానికి తెరపడిపోయింది. విలీనం అనే మంత్రం ఒక్కటే పపన్ కల్యాణ్ పఠించలేదు. ఎంచక్కా.. భారతీయ జనతా పార్టీ చంక ఎక్కి కూర్చున్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో కూడా ప్యాకేజీ ఉన్నదా లేదా అనే సంగతి అప్రస్తుతం. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయ పార్టీని మోస్తున్న భారాన్ని ఒక్క నిర్ణయంతో దించుకున్నారు.

ఇక  సినిమా స్టోరీ సిటింగులో చాటుమాటుగా ఎవ్వరికీ కనిపించకుండా చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా స్టోరీ సిటింగులకు సంబంధించిన వార్తలు మీడియాలో పొక్కితే కంగారు పడాల్సిన అవసరమూ లేదు. తనే స్వయంగా నెక్ట్స్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనౌన్స్ మెంట్ కూడా చేయొచ్చు. రాజకీయ పార్టీ నేతగా అన్ని రకాల ఒత్తిళ్లనుంచి పవన్ రిలీవ్ అయ్యారు. కేవలం భాజపాతో  పొత్తు ద్వారా ఇది జరిగిపోయిందని పలువురు భావిస్తున్నారు.

ఎన్నికల సమయంలో.. భాజపా పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావన దృష్ట్యా పవన్ కాస్త ఎడం నటించారు తప్ప.. వారితో విభేదించలేదు. అప్పటి అవసరానికి కమ్యూనిస్టు పార్టీలను పవన్ యూజ్ అండ్ త్రో టిష్యూపేపర్ లాగా వాడుకున్నారనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. నేను కమ్యూనిస్టును, మా నాన్న కమ్యూనిస్టు అంటూ వారిని తన అవసరానికి మభ్యపెట్టి.. ఇప్పుడు మళ్లీ ఆయన కమలదళంతో పాత స్నేహాన్ని పునరుద్ధరించుకున్నారు.

ఒంటరి పార్టీగా జనసేనను నడపడం పవన్ తలకు మించిన భారం అయిపోయింది. సోదిలోనే లేడని ప్రజలు అనుకోకుండా.. ఏదో ప్రకటనలు ఉద్యమాలు చేస్తూ రోజులు నెట్టుకొచ్చారే తప్ప.. ఆయనకు పార్టీ తలనొప్పిగా మారిందనే సంకేతం కూడా ప్రజలకు అందింది. అందుకే చాన్నాళ్లుగా భాజపా భజనచేస్తూ.. మోడీ-షాలను ఆకాశానికెత్తేస్తూ.. దేశానికి వారి అవసరాన్ని నొక్కి వక్కాణిస్తూ.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు పొత్తు కూడా పెట్టేసుకున్నారు.

ఇక ఏం చేసినా కలిసే చేయాలని డిసైడ్ అయ్యారు. దాని అర్థం.. కార్యక్రమాల నిర్వహణ భారం ఆయన వదిలించుకున్నారన్నమాట. కార్యక్రమాలను భాజపా చేస్తుంటుంది. జనసేన కూడా అందులో ఉన్నట్లుగా.. పవన్ అతిథిలాగా వచ్చి పాల్గొని వెళ్తుంటారు. ఆయన ఏదో పోరాడేసి, ఏదో సాధించేస్తాడని.. ఈ కొన్ని రోజులపాటూ కొత్తగా నమ్మిన వారు కూడా ఇప్పుడు విస్తుపోతున్నారు.