తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ తన లాంఛనాన్ని పూర్తి చేసింది. నామినేషన్ల ఘట్టం మొదలయ్యాకా.. అభ్యర్థిని ఖరారు చేసింది. నామినేషన్ల గడువులోగా అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టే. ఇక పనిలో పనిగా సదరు అభ్యర్థి, కొంతమంది కమలం పార్టీ నేతలు వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇదే సమయంలో ఆయనను ప్రచారానికి కూడా ఆహ్వానించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనబోతున్నట్టుగా కానీ, పాల్గొంటారనే విషయాన్ని కానీ ఇప్పటి వరకూ అటు బీజేపీ, ఇటు జనసేనలు ధ్రువీకరించడం లేదు. ఇప్పటికే ఉన్న ప్రచారం ప్రకారం అయితే.. బీజేపీ అధినాయకత్వం గనుక తిరుపతి బై పోల్ ప్రచారానికి వస్తే, పవన్ కల్యాణ్ అక్కడ ప్రచారం చేస్తారని, వారు రాలేదంటే ఈయన కూడా వెళ్లారని అంటున్నారు.
తను, బీజేపీ అగ్రనాయకులూ ఒకే స్థాయి వాళ్లమని… అమిత్ షా, యోగి ఆదిత్య తదితర నేతలు తిరుపతిలో ప్రచారం చేస్తే, తను కూడా చేస్తానంటూ పవన్ కల్యాణ్ షరతు పెట్టారట.
మరి ఈ షరతు మీద ఆయన ఎంత వరకూ నిలబడగలరు? అనేది ప్రశ్నార్థకమే. ఎలాగూ తిరుపతిలో బీజేపీకి దక్కేదేమీ లేదనే క్లారిటీ ఉంది కాబట్టి, ఆ పార్టీ అధినాయకత్వం తిరుపతి వైపు తొంగి చూడకపోవచ్చు. పవన్ కల్యాణ్ తప్పనిసరిగా తిరుపతిలో ప్రచారం చేయాల్సి రావొచ్చు. మరి పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా.. తిరుపతిలో బీజేపీ ఎంత వరకూ ఏ మేరకు ముక్కుతుంది? అనేది కూడా చాలా స్పష్టత ఉన్న అంశమే. నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియని అభ్యర్థిని, తీరా నామినేషన్ల గడువు ముందున తీసుకువస్తే పోలోమని జనాలు ఓట్లేస్తారా? అందునా.. ఏపీకి బీజేపీ ద్రోహం చేయడానికే కాదు, ద్రోహం చేసినట్టుగా ఒప్పుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.
ఆ పై మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు దక్షిణాదిన వేడి పుట్టిస్తూ ఉన్నాయి. ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడిలో కాకపుట్టిస్తున్నాయి. భక్తగణం ఈ విషయాలను ఒప్పుకోకపోవచ్చు. సామాన్యుల్లోకి వెళ్లి ఈ విషయాల గురించి తరచి చూస్తే అర్థం అవుతుంది.
ఈ పరిణామాల మధ్యన తిరుపతిలో బీజేపీ నోటాతోనూ, కాంగ్రెస్ తోనూ పోటీ పడితే అదే ఎక్కువ కావొచ్చు! మరి ఈ మాత్రం దానికి వెళ్లి పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే, అప్పుడు బీజేపీ గరిష్టంగా డిపాజిట్ దక్కించుకుంటే.. పవన్ కల్యాణ్ పరువు కూడా పోతుంది. అయినా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి తిరుపతిలో బీజేపీ ఎలా ఓడినా వచ్చే నష్టం ఏమీ లేదేమో!