మొన్నటివరకు గుబురు గడ్డం, భారీ జుట్టుతో బాబాలా కనిపించారు పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మేకోవర్ అయ్యారు. క్లీన్ షేవ్ చేయలేదు కానీ గడ్డాన్ని చాలా ట్రిమ్ చేశారు. హెయిర్ స్టయిల్ ను కూడా దగ్గరకు కుదించారు. ఇంకా చెప్పాలంటే పవన్ ముఖం ఇప్పుడు కనిపిస్తోంది. గతంలోలా గడ్డం, జుట్టు మధ్య చిక్కుకుపోలేదు.
ప్రస్తుతం పవన్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా బాగానే ఉంది కానీ, ఉన్నఫలంగా పవన్ ఎందుకిలా గడ్డం గీసి, జుట్టు కత్తిరిచ్చినట్టు? దీనికి సమాధానంగా వినిపిస్తున్న ఒకే ఒక్కపదం తానా. అవును.. అమెరికాలో జరగనున్న తానా సభల కోసమే పవన్ ఇలా మేకోవర్ అయ్యాడని అంటున్నారు చాలామంది.
ఎన్నికల ఫలితాల వరకు మొక్క కోసం పవన్ ఇలా గడ్డాలు, జుట్టు పెంచాడని అంతా అనుకున్నారు. ఫలితాల్లో జనసేన పవర్ ఏంటో తేలిపోవడంతో, పవన్ ఇక తన బాబా అవతారాన్ని విడిచిపెడతారని ఊహించారు. రిజల్ట్ తర్వాత కూడా పవన్ సింపతీ కోసం అదే గెటప్ ను కొనసాగించారు. కానీ ఇప్పుడు తానా సభల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో గడ్డంతీయాల్సి వచ్చిందట.
ఇదే ఊపులో పవన్ సినిమాల్లోకి కూడా వస్తే బాగుంటుందని అతడి వీరాభిమానులు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. పవన్ లుక్ బాగుందని, అదే లుక్ లో ఓ సినిమా చేయాలని వాళ్లు కోరుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో జనసైనికులు కూడా పవన్ ఇప్పటికిప్పుడు సినిమా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పోస్టులు పెడుతున్నారు.
చాలామంది మాత్రం పవన్ మెల్లమెల్లగా తన పాత లుక్ లోకి వచ్చి ఏదో ఒక రోజు సినిమా స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఫుల్ టైమ్ రాజకీయాల్లోనే కొనసాగుతానంటున్న పవన్, చెప్పినట్టుగానే రాజకీయాల్లోనే కొనసాగుతారా లేక ఒట్టు తీసి గట్టున పెడతారా అనేది తేలాల్సి ఉంది.