ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అన్నదానిపై బిన్న వాదనలు విన్పిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో సోమవారాన్ని పోలవారంగా ప్రకటించుకున్నా.. పబ్లిసిటీ జరిగిన స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరగలేదన్నది నిర్వివాదాంశం. పేరుకి జాతీయ ప్రాజెక్టే అయినా, ఆ ప్రాజెక్ట్‌ని నిర్మించేది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం – రాష్ట్రం మధ్య లాలూచీలు, వివాదాలతో పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యింది.
2018 చివరి నాటికే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోతుందని చాన్నాళ్ళ క్రితం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. ఇప్పుడిది 2019. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవడం సంగతి దేవుడెరుగు.. నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయే పరిస్థితులొచ్చాయిప్పుడు. ప్రాజెక్టులో నీళ్ళ సంగతేమోగానీ, అవినీతి పొంగి పొర్లుతోందన్నది అటు బీజేపీ, ఇంకోపక్క ప్రస్తుత అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఆరోపణ. అయితే, అవినీతి విషయమై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు. ఎందుకంటే టీడీపీతో నాలుగేళ్ళు బీజేపీ అంటకాగింది మరి.
ఇక, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టుని సందర్శించబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని సహా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్ట్‌ని సందర్శించి ప్రాజెక్టు ప్రస్తుత 'స్టేటస్'పై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందన్నది మంత్రుల తాజా అంచనా.
మామూలుగా అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ విషయమ్మీద ప్రకటన చేయాల్సి వచ్చినా.. ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది పోలవరం లాంటి ప్రాజెక్టు విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఆలోచించాలి.? రెండు మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదన్నది నిప్పులాంటి నిజం. పైగా, ఇది కేంద్రం నుంచి వచ్చే నిధులతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్. దాంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న విషయమై వైఎస్ జగన్ ఆచి తూచి ప్రకటన చేయాల్సి వుంటుంది.
కేంద్రం సహకరించని పక్షంలో, ఐదేళ్ళయినా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితే వుండదు. సో, వైఎస్ జగన్ ప్రకటన కోసం ఇప్పుడు రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది. చంద్రబాబులా ఆర్నెళ్ళలోనో సంవత్సరంలోనో ప్రాజెక్ట్ పూర్తవుతుందన్న ప్రకటన మాత్రం వైఎస్ జగన్ నుంచి వచ్చే అవకాశమే లేదు.