దేశ వ్యాప్తంగా మరో మారు 'జమిలి' చర్చ జరుగుతోంది. లోక్‌సభకీ, అసెంబ్లీకీ ఒకేసారి ఎన్నికలు జరగగడమే ఈ జమిలి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి జమిలి ఎన్నికలు జరుగుతున్నట్లే. తెలంగాణ కూడా ఈ లిస్ట్‌లోనే వుండాల్సిందిగానీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ముందస్తుగా తమ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో తెలంగాణలో అసెంబ్లీకి ఓసారి, లోక్‌సభకు ఇంకోసారి ఎన్నికలు జరిగాయి.
అంటే, 'జమిలి' ఎన్నికలపై ఎంతటి కీలక నిర్ణయం జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయంతో తీసుకున్నాగానీ, ఉల్లంఘన చాలా తేలికన్నమాట. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా ముందస్తు ఎన్నికలు జరపాల్సి వస్తే, జమిలి వ్యవహారం ఏమవుతుంది.? జాతీయ స్థాయిలో ఇదే పరిస్థితి వస్తే, 'జమిలి' పరంగా ఎలాంటి నిర్ణయాల మార్పు జరుగుతుంది.? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి వుంది.
అసలంటూ, ఇప్పుడు జమిలి ఎన్నికల గురించిన చర్చ ఎందుకు.? చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం, జమ్మూ కాశ్మీర్ వ్యవహారం, పార్టీ ఫిరాయింపుల్ని నిరోధించే అంశం.. ఇలాంటి వ్యవహారాల జోలికి వెళ్ళకుండా, జమిలి చుట్టూనే ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తులు ప్రారంభించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అన్న ప్రశ్నల చుట్టూ భిన్న వాదనల విన్పిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ నరేంద్ర మోడీ ఇలానే దూకుడు ప్రదర్శించారు. చివరికి ఏమయ్యిందో చూశాం. రేప్పొద్దున్న జమిలి అమల్లోకి వచ్చినా, అది అటకెక్కడానికి పెద్దగా సమయం పట్టదు.
వరుసగా రెండోసారి అఖండ మెజార్టీతో దేశంలో అధికారంలోకి వచ్చామన్న 'అత్యుత్సాహం' తప్ప, జమిలి ఎన్నికల విషయంలో బీజేపీకే చిత్తశుద్ధి లేదన్న వాదన కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. జమిలి ఎన్నికలకు తాజాగా మద్దతిచ్చిన టీఆర్ఎస్, లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడం ఇష్టం లేక.. ముందస్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.?
పార్టీలు.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా అంశాలకు మద్దతివ్వొచ్చుగాక.. కానీ, ఆ తర్వాత ఆయా అంశాలకు కట్టుబడి వుంటాయా.? పైగా, జమిలిపై రాజ్యాంగ సవరణ చేసినా.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగే అవకాశమే వుండదు. రాష్ట్రాల్లో అయినా, దేశంలో అయినా స్థిరమైన ప్రభుత్వాలే వుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అస్థిర ప్రభుత్వాలు ఏర్పాటయితే.. 'జమిలి' అన్న ప్రస్తావనకు అర్థమే లేకుండా పోతుంది.