రావాలి పవన్.. కావాలి పవన్

రావాలి జగన్.. కావాలి జగన్.. ఈ ఎన్నికల్లో తూటాలా పేలిన స్లోగన్ కమ్ సాంగ్ ఇది. ఇప్పుడీ పాటకు పేరడీ మరోటి వినపడుతోంది. రావాలి పవన్.. కావాలి పవన్. పవన్ కల్యాణ్ అభిమానులు మొదలు…

రావాలి జగన్.. కావాలి జగన్.. ఈ ఎన్నికల్లో తూటాలా పేలిన స్లోగన్ కమ్ సాంగ్ ఇది. ఇప్పుడీ పాటకు పేరడీ మరోటి వినపడుతోంది. రావాలి పవన్.. కావాలి పవన్. పవన్ కల్యాణ్ అభిమానులు మొదలు పెట్టబోతున్న ఉద్యమం ఇది. అయితే ఇదేదో పవన్ ని సీఎం చేయడం కోసం మాత్రంకాదు. ఆయన్ను రాజకీయాల నుంచి వెనక్కి రప్పించేందుకే పవన్ అభిమానులు ఈ కొత్త స్లోగన్ అందుకుంటున్నారు.

రాజకీయాల్లో జీరో కావొచ్చేమో కానీ, సినిమాల్లో మాత్రం పవర్ స్టార్ క్రేజే వేరు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఇక సినిమాలు చేయనని కరాఖండిగా చెప్పేశారు పవన్. దీన్ని అభిమానులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళితే వెళ్లారు… ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ ని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు.

తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ పవన్ ని తిరిగి సినిమాల్లోకి తీసుకు రావాలనే గట్టి నిర్ణయంతో ఉన్నారట. కావాలంటే.. రెండేళ్ల తర్వాత తిరిగి రాజకీయాలపై దృష్టిపెట్టాలని, కనీసం తమ కోసమైనా రాజకీయాలతో పాటు, సినిమాలకీ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారట. అందుకే రావాలి పవన్.. కావాలి పవన్.. స్లోగన్ ని తెరపైకి తెస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ లో ఓ వర్గం దీనికి రంగం సిద్ధంచేసింది. సోషల్ మీడియాలో రావాలి పవన్.. కావాలి పవన్ అంటూ ఓ ఉద్యమం మొదలు కాబోతోంది. సెల్ టవర్లు ఎక్కడాలు, ఆత్మత్యాగాలు.. ఇలాంటి హైలెవల్ డ్రామాలు కూడా ఈ ఉద్యమం చివర్లో కనిపించే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం ఫ్యాన్స్ ఉద్దేశమేనా.. లేక మెగా ప్యామిలీ తెరవెనక ఉండి ఆడిస్తున్న డ్రామానా అనేది తేలాల్సి ఉంది.

అభిమానుల ఒత్తిడి మేరకే పవన్ తిరిగి సినిమాల్లోకి వచ్చారని చెప్పడానికి ఈ సరికొత్త ఎత్తుగడను షురూ చేసినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద చంద్రబాబుతో నాలుగేళ్లు కలిసున్నందుకు పవన్ కు కూడా బాబు తెలివితేటలు కాస్త అబ్బినట్టున్నాయి.

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?