రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఇసుక కొరత వలన ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. వారికి మద్దతుగా.. వారిలో దేవుడిని చూస్తున్న పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. అంతవరకు బాగానేఉంది. కానీ.. తను చేపట్టిన ఆందోళన ద్వారా.. ఆ సమస్యకు పవన్ కల్యాణ్ ఏ విధమైన పరిష్కారం చూపదలచుకున్నారో, సాధించారో మాత్రం అర్థం కావడం లేదు.
ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోతే.. ఆయన తర్వాత ఇతర పోరాటాల ద్వారా ఏ రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచదలచుకున్నారు అనేది మరింత నీరసంగా ఉంది.
పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇంతకూ ఆయన తేల్చిందేమిటి? ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు. రెండు వారాల్లోగా ఇసుక సమస్యను పరిష్కరించకపోతే… ఇసుకను అందుబాటులోకి తేకపోయినట్లయితే.. అంటూ హూంకరించారు.
అవును రెండు వారాల్లోగా ప్రభుత్వం ఇసుక సమస్య తీర్చకపోతే ఇంతకూ పవన్ ఏం చేయబోతున్నారో తెలుసా…? ఆయన స్వయంగా అమరావతిలోనూ నడుస్తారట. ఢిల్లీ వెళ్తారట. మోడీ ఆయనతో ప్రేమగా మాట్లాడుతుంటారు గనుక.. ఆయనకు సమస్య చెబుతారట. ఒక నాయకుడు చూపించవలసిన పరిష్కార మార్గాలు ఇవేనా?
విశాఖలో నడిచిన వ్యక్తి, అమరావతిలో కూడా నడిస్తే ఏమవుతుంది? నదులన్నీ పొంగి వెల్లువలా సముద్రంలోకి వెళ్లిపోతాయా? లేదా, నదుల్లో ప్రవాహం మొత్తం భూగర్భంలోకి యింకిపోతుందా? తద్వారా ఇసుక తవ్వుకోవడానికి వీలుగా.. ఇసుకమేటలు మిగులుతాయా? అనేది అర్థం కావడం లేదు.
నదుల్లో ప్రవాహం ఉధృతిగా ఉన్నమాట నిజం. దీనిని ఇప్పటికిప్పుడు ఎలా తొలగించి ఇసుకను అందుబాటులోకి తేవాలి? వర్షాలు వరదలు కొత్తా? పరిస్థితిని ఊహించి ముందుగా ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేదు..? అని సంక్షోభ నివారణలో అపారమైన అనుభవం ఉన్న పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు వర్షాలు వచ్చినంత సుదీర్ఘకాలం.. విడవకుండా ప్రవాహం రావడం.. ఎగువ రాష్ట్రాల్లో అనూహ్యమైన వానల వల్ల.. నదుల్లో ప్రవాహాలు ఇప్పటికీ పొంగుతూనే ఉండడం అనేది.. ఇంత సుదీర్ఘకాలం నీటి ప్రవాహం అనేది రాష్ట్రం చూసి ఎన్నేళ్లు గడిచిందో ఆయన చెప్పాలి. ఇలాంటి పరిస్థితిని ఎలా అంచనావేయాలో కూడా ఆయనే చెప్పాలి.
భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటించకుండా.. ప్రత్యామ్నయాలు ఏమైనా చూడమని అడగడం విజ్ఞతగా ఉంటుందే తప్ప.. రెండు వారాల్లో సమస్య మొత్తం తీరిపోవాలని ప్రభుత్వానికి డెడ్లైన్ పెడితే హాస్యాస్పదంగా ఉంటుంది.