పవన్ జీ.. అహంకారం కాస్త తగ్గాలి!

పవన్ కల్యాణ్ తాను ఎన్నటికీ అధికారం కోరుకునే బాపతు రాజకీయనాయకుడిని కాదని, కేవలం ప్రజల తరఫున ప్రశ్నించడానికి మాత్రమే, వారి సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తానంటూ సుద్దులు చెబుతుంటారు. Advertisement కోట్లకు కోట్ల రూపాయల…

పవన్ కల్యాణ్ తాను ఎన్నటికీ అధికారం కోరుకునే బాపతు రాజకీయనాయకుడిని కాదని, కేవలం ప్రజల తరఫున ప్రశ్నించడానికి మాత్రమే, వారి సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తానంటూ సుద్దులు చెబుతుంటారు.

కోట్లకు కోట్ల రూపాయల సినిమా ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రవచనాలు చెబుతుంటారు. కానీ వ్యవహారంలో మాత్రం.. ఆయనలోని అలవిమాలిన అహంకారం ఎల్లెడలా కనిపిస్తూ ఉంటుంది.

నిన్నటికి నిన్న పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి.. నాయకులు వచ్చి కలిస్తే.. కేసీఆర్‌తో మాట్లాడి సెటిల్ చేస్తా అని చెప్పిన పవన్ కల్యాణ్..  వాళ్లు వెళ్లగానే ఆ హామీని పక్కన పడేశారు.

నిన్న సభలో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని.. చెప్పుకొచ్చారు. ఆయన అపాయింట్‌మెంట్ ఇచ్చి ఉంటే గనుక.. ఈపాటికి ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం చూపి ఉండేవాడిని అన్నంత రేంజిలో బిల్డప్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ ప్రగల్భాలకు అడ్డే ఉండదు. ఆయన మాటకు ముందు.. తాను మోదీతో మాట్లాడుతానని.. మోడీ దగ్గర తాను ఎంత చెబితే అంతేనని అన్నట్లుగా ఆయన బిల్డప్ ఇస్తుంటారు.

అధికారంలో ఉన్న వారి వద్దకు సమస్యల ఎజెండాతో విపక్ష నాయకులు, ప్రజా సమస్యల పట్ల స్పృహ ఉన్నవారు వెళ్లడం అనేది కొత్త సంగతి ఎంతమాత్రమూ కాదు. ఎప్పుడూ జరిగేదే. కాకపోతే పవన్ అలా కేసీఆర్ ను కలుస్తా, మోడీని కలుస్తా.. అంటూ కబుర్లు చెప్పడమే తప్ప.. ఏ సమస్యతోనూ వారిని కలిసింది మాత్రం లేదు.

ఇప్పటిదాకా పవన్ ప్రజాసమస్యలతో కలిసింది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాత్రమే. బాబును కలవడానికి పవన్‌కు ప్రజా సమస్యలు ఒక సాకు మాత్రమే. ఆయన అసలు ఎజెండాలు వేరు. అమరావతి రైతుల తరఫున, ఉద్ధానం బాధితుల తరఫున అనే సాకులతో పవన్ రెండుసార్లు సీఎం బాబును కలిసినా ఆ సమస్యలపై సాధించిందేమీ లేదు.

ఇక్కడ అసలు సందేహం ఏంటంటే.. ఇలాంటి మాటలు చెప్పే పవన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇసుక  లేదా ఏపీలోని మరో ప్రజా సమస్యలపై సీఎం జగన్ ను ఎందుకు కలవదలచుకోవడం లేదు. ఆయన అంకితభావం ఏమైంది?

సీఎం జగన్‌ను కలవడానికి.. రెండు చోట్ల ఆయన పార్టీ చేతిలో ఓడిపోయిన పవన్ కు మొహం చెల్లడం లేదా? లేదా, జగన్‌ను సీఎంగా అంగీకరించడానికి, పవన్ అహంకారం అడ్డొస్తోందా?

పవన్ కు ప్రజలపట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అహంకారానికి కత్తెర వేసుకుని… ముఖ్యమంత్రి జగన్ ను కలవాలి. ప్రజల సమస్యలను నివేదించాలి. సమస్యలు తీరుతాయా లేదా తర్వాతి సంగతి.. కనీసం పవన్‌కు చిత్తశుద్ధి ఉందనే సంగతి అందరూ నమ్ముతారు.