పార్టీ ఒకే ఒక్క స్థానంలో గెలిచినా, తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా పవన్ కల్యాణ్ 6 నెలల్లో తాను అనుకున్నది సాధించారు. కేవలం జగన్ ని వ్యతిరేకించడం ఒక్కటే పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. తప్పో ఒప్పో.. తాను అనుకున్న దారిలో వెళ్తూ తానంటూ ఒకడ్ని ఉన్నానని రాష్ట్రం మొత్తం గుర్తించేలా చేయగలిగారు పవన్ కల్యాణ్.
ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరుకంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరే రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ 6నెలలలో చంద్రబాబుకంటే పవన్ కల్యాణ్ పేరునే అధికార పక్షం ఎక్కువగా కలవరించింది. అంతెందుకు అధికారంలోకి వచ్చన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకంటే ఎక్కువ ఘాటుగా పవన్ కల్యాణ్ నే విమర్శించారు.
ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతోందనే విషయం మాత్రం అర్థమవుతోంది. బీజేపీ రహస్య అజెండాతో పవన్ పనిచేస్తున్నారన్నది వాస్తవం, అదే సమయంలో చంద్రబాబుతో ఉన్న స్నేహాన్ని కూడా పవన్ వదులుకోలేకపోతున్నారు. ఈ రెండు పార్టీలకు కూడా పవన్ ఆవేశం కావాలి, జగన్ ని ఎదిరించే నాయకుడు కావాలి. అందుకే పవన్ ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటున్నాయి.
మంచోడు అనుకోకపోయినా, మతిలేని వాడు అని అనుకున్నా సరే.. పవన్ ని మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గుర్తించారు. సోషల్ మీడియాలో అయితే పవన్ కల్యాణ్ ప్రస్తావన లేని రాజకీయ కార్టూన్ లేదంటే అతిశయోక్తి కాదు. ట్రోలింగ్ విషయంలో కూడా అంతే, లోకేష్ ని ఎప్పుడో మించిపోయారు పవన్. జగన్ ని విమర్శించినప్పుడల్లా పవన్ కి విపరీతమైన నెగెటివ్ పబ్లిసిటీ వస్తోంది. అదే సమయంలో జగన్ వ్యతిరేక మీడియా పవన్ ని నెత్తికెత్తుకుంటోంది.
ఇలా తప్పు చేస్తున్నా పవన్ తన ఉనికిని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పవన్ ఓ వర్గం వారికి చేరువయ్యారు. జగన్ రెడ్డీ, జగన్ రెడ్డీ అని పదే పదే ప్రస్తావిస్తూ.. రెడ్డి వ్యతిరేక సామాజిక వర్గాలకు కాస్త ఊరటనిచ్చారు. కులాల కుంపట్లు రాజేయడంలో మాత్రం పవన్ కొంతమేర సక్సస్ అయ్యారు.
పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ కి ఇది ఎంతమాత్రం ఉపయోగపడుతుందో చెప్పలేం కానీ.. కనీసం పవన్ అనే నాయకుడు, పవన్ నాయుడు ఒకరున్నారు అని మాత్రం ప్రజలు గుర్తించేలా చేశారు.