Advertisement

Advertisement


Home > Politics - Gossip

పెద్దిరెడ్డి త‌మ్ముడిపై బ‌ల‌మైన అభ్య‌ర్థి!

పెద్దిరెడ్డి త‌మ్ముడిపై బ‌ల‌మైన అభ్య‌ర్థి!

వైసీపీలో అత్యంత బ‌ల‌మైన నాయ‌కుడు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. పెద్దిరెడ్డి కుటుంబంలో ముగ్గురు ప్ర‌జాప్ర‌తినిధులున్నారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి, తంబ‌ళ్ల‌ప‌ల్లె నుంచి ఆయ‌న త‌మ్ముడు ద్వార‌కనాథ‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. పుంగ‌నూరు నుంచి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

పెద్దిరెడ్డి కుటుంబ స‌భ్యుల‌పై దీటైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టేందుకు చంద్ర‌బాబునాయుడు సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తంబ‌ళ్ల‌ప‌ల్లెలో బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిలిపే క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే ఏవీ ప్ర‌వీణ్‌రెడ్డితో టీడీపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ ఏ పార్టీలోనూ లేరు. తంబ‌ళ్ల‌ప‌ల్లెతో ప్ర‌వీణ్ కుటుంబానికి స‌త్పంబంధాలున్నాయి.

ప్ర‌వీణ్ తండ్రి ఉమామ‌హేశ్వ‌ర‌రెడ్డి గ‌తంలో ఎమ్మెల్సీగా ప‌ని చేశారు. ఉమామ‌హేశ్వ‌ర‌రెడ్డి హ‌త్య‌కు గురి కావ‌డంతో ఆయ‌న భార్య ల‌క్ష్మిదేవ‌మ్మ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1985, 1994ల‌లో టీడీపీ త‌ర‌పున ఆమె తంబ‌ళ్ల‌ప‌ల్లె నుంచి గెలుపొందారు. ఆ త‌ర్వాత 2009లో ప్ర‌వీణ్ గెలుపొందారు. అనంత‌రం ఆయ‌న వైసీపీలోకి ఫిరాయించారు. వైసీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ప‌లికి అన‌ర్హ‌త వేటుకు గుర‌య్యారు.

వైసీపీలో ఆధిప‌త్య పోరుకు ఆయ‌న బ‌లి అయ్యారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో విభేదించి, చివ‌రికి పార్టీని వీడారు. అనంత‌రం ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా వుంటున్నారు. ప్ర‌స్తుతం తంబ‌ళ్ల‌ప‌ల్లె టీడీపీ ఇన్‌చార్జ్‌గా జి.శంక‌ర్‌యాద‌వ్ ఉన్నారు. ఈయ‌న‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్య‌తిరేక‌త వుంది. దీంతో పెద్దిరెడ్డి త‌మ్ముడిని ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మ‌ని టీడీపీ భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌వీణ్‌ను చేర్చుకుని టికెట్ ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నాల్ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగా ప్ర‌వీణ్‌తో మాజీ మంత్రులు లోకేశ్‌, అమ‌ర్నాథ్‌రెడ్డి చ‌ర్చ‌లు జ‌రిపినట్టు స‌మాచారం. టికెట్ వ‌ర‌కూ ఓకే అయిన‌ప్ప‌టికీ, ఆర్థిక వ‌న‌రుల విష‌య‌మై స్ప‌ష్ట‌మైన హామీ ల‌భిస్తే ప్ర‌వీణ్ బ‌రిలో దిగ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆ దిశ‌గా సానుకూల చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌వీణ్‌రెడ్డి టీడీపీ అభ్య‌ర్థి అయితే మాత్రం పెద్దిరెడ్డి త‌మ్ముడు ద్వార‌క‌నాథ‌రెడ్డి గ‌ట్టి పోటీ ఎదుర్కోవాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?