తెలుగుదేశం నేతల వరస అరెస్టుల పరంపరలో తదుపరి ఎవరనే అంశంపై స్పష్టత వస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడు ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయ్యారు. కొంత కాలం పాటు అచ్చెన్నాయుడు ఆ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహించగా అప్పుడు స్కామ్ మొదలైందని ఏసీబీ వర్గాలు అంటున్నాయి. విశేషం ఏమిటంటే.. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్న అనంతరం బాధ్యతలు స్వీకరించిన పితాని సత్యనారాయణ హయాంలో కూడా అదే కొనసాగిందని తెలుస్తోంది. ఈ క్రమంలో పితాని అరెస్టు కూడా తప్పదనే టాక్ చాన్నాళ్లుగా ఉంది.
పితాని మంత్రిగా ఉండగా, ఆయన తనయుడు వెంకట సురేష్ చక్రం తిప్పారని, కార్మిక శాఖకు సంబంధించిన ప్రతి వ్యవహారంలోనూ ఆయనది 10 పర్సెంట్ కమిషన్ అని టాక్. ఈ మేరకు ఏసీబీ గుర్తించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. పితాని వెంకట సురేష్ కు అరెస్టు భయం పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హై కోర్టును ఆశ్రయించడం జరిగింది. పితాని వెంకట సురేష్ తో పాటు.. అప్పట్లో పితానికి పీఎస్ గా వ్యవహరించిన మురళీ మోహన్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరి పిటిషన్ లనూ కోర్టు తిరస్కరించింది
ఈ పిటిషన్ విచారణలో ఉండగానే మురళీ మోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పితాని వెంకట సురేష్ కు కూడా కోర్టు ముందుస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన అరెస్టు జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్టు కాగా.. ఇప్పుడు పితానిని అరెస్టు చేస్తారా? ఆయనతో పాటు ఆయన తనయుడిని కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.