క‌రోనా కేసులు పీక్స్..ఇప్పుడే క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ పెనుగులాట‌?

క‌రోనా సెకెండ్ వేవ్ లో  దేశంలో కోవిడ్ కేసులు అత్య‌ధికంగా న‌మోదైన రాష్ట్రాల్లో ముందు వ‌ర‌స‌లో ఉంది క‌ర్ణాట‌క‌. ఒక ద‌శ‌లో అక్క‌డ యాక్టివ్ కేసుల లోడు ఐదు ల‌క్ష‌ల స్థాయికి చేరింది. ఇప్పుడు…

క‌రోనా సెకెండ్ వేవ్ లో  దేశంలో కోవిడ్ కేసులు అత్య‌ధికంగా న‌మోదైన రాష్ట్రాల్లో ముందు వ‌ర‌స‌లో ఉంది క‌ర్ణాట‌క‌. ఒక ద‌శ‌లో అక్క‌డ యాక్టివ్ కేసుల లోడు ఐదు ల‌క్ష‌ల స్థాయికి చేరింది. ఇప్పుడు కూడా క‌ర్ణాట‌క అత్య‌ధిక క‌రోనా యాక్టివ్ కేసులున్న రాష్ట్రంగా నిలుస్తోంది. ర‌మార‌మీ 2.93 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులున్నాయి ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే. 

ఒక‌వైపు ప‌రిస్థితి అలా ఉండ‌గా.. ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ పెనుగులాట సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప‌ను  ప‌ద‌వి నుంచి దించాల‌ని ఒక వ‌ర్గం, ఆయ‌న‌ను దించ‌డానికి వీల్లేద‌ని మ‌రో వ‌ర్గం మీడియా ముఖంగా వాద‌న‌లు మొద‌లుపెడుతున్నాయి. బీజేపీలోనే ప‌ర‌స్ప‌ర విబేధ వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. య‌డియూర‌ప్ప‌ను అధిష్టానం సాగ‌నంప‌నుందంటూ ఒక వ‌ర్గం ప్ర‌చారం చేస్తూ ఉంది. అయితే య‌డియూర‌ప్ప అనుకూలురులు మాత్రం అలాంటిదేమీ లేద‌ని అంటున్నారు.

ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు య‌డియూర‌ప్పను దించేయ‌డానికి ఇదే స‌మ‌యయ‌మ‌ని ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. మ‌రోవైపు య‌డియూర‌ప్ప త‌న‌యుడు రంగంలోకి దిగాడ‌ట‌. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు చోటే లేద‌ని చెప్పుకునే బీజేపీలో ఇలా తండ్రి ప‌ద‌విని కాపాడేందుకు త‌న‌యుడు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఇక య‌డియూర‌ప్పను వ్య‌తిరేకిస్తున్న వ‌ర్గం ఆయ‌న త‌న‌యుడు విజ‌యేంద్ర‌పై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తోంద‌ట‌. య‌డియూర‌ప్ప‌కు  ఆరోగ్యం స‌రిగా లేని తరుణంలో విజ‌యేంద్ర‌ త‌నే సీఎం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌లువురు బీజేపీ ఎంపీలూ, ఎమ్మెల్యేలు ఢిల్లీ నేత‌ల‌కు కంప్లైంట్లు చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో స్వ‌యంగా విజ‌యేంద్ర‌ రంగంలోకి దిగి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ ఉండ‌టం కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను గుర్తు చేస్తూ ఉంది!

య‌డియూర‌ప్ప‌కు దాదాపు ఏడాదిన్న‌ర నుంచి అధిష్టానం కూడా పెద్ద‌గా ఫ్రీహ్యాండిచ్చిన దాఖ‌లాలు లేవు. కాంగ్రెస్-జేడీఎస్ కూట‌మి స‌ర్కారును వారు చేజేతులారా కూల్చుకున్నాకా బీజేపీ చ‌క్రం తిప్పి య‌డియూర్ప‌ను మ‌ళ్లీ సీఎం సీట్లో కూర్చో బెట్టింది. ఆ త‌ర్వాత య‌డియూర‌ప్ప ప్ర‌భుత్వాన్ని ఎలాగోలా నిల‌బెట్టుకుంటున్నారు కానీ, అధిష్టానం విశ్వాసాన్ని పొంద‌లేక‌పోతున్నారు.

అందుకు నిద‌ర్శ‌నం ఏడాదిన్న‌ర‌గా వాయిదా ప‌డుతున్న కేబినెట్ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌. య‌డియూర‌ప్ప ఆ విష‌య‌మై ప‌లు సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్ర‌యోజ‌నం లేక‌పోయిన‌ట్టుగా ఉంది. ఇక య‌డియూర‌ప్ప ఫ‌స్ట్ వేవ్ లోనే క‌రోనాకు గుర‌య్యారు, కోలుకున్నారు. మ‌రోసారి కూడా ఆయ‌న‌కు క‌రోనా సోకిన‌ట్టుగా ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

ఆయ‌న వ‌య‌సు రీత్యా, ఆరోగ్య రీత్యా అంత యాక్టివ్ గా అయితే క‌నిపించ‌డం లేదు. అయితే.. య‌డియూర‌ప్ప‌ను సీఎం హోదా నుంచి త‌ప్పించేంత సాహ‌సం అధిష్టానం చేయ‌లేక‌పోతోంది. బ‌లంగా ఉన్న లింగాయ‌త్ ఓట్ల బ్యాక‌ప్ క‌లిగిన య‌డియూర‌ప్ప‌ను దించ‌డం బీజేపీ అధిష్టానం చేసే సాహ‌స‌మే అవుతుంది. 

అచ్చం కాంగ్రెస్ త‌ర‌హా రాజ‌కీయం న‌డుస్తోంది క‌ర్ణాట‌క బీజేపీలో. మ‌రోవైపు క‌న్న‌డ ప్ర‌జ‌ల్లో బీజేపీ స‌ర్కారుపై విశ్వాసం త‌గ్గిపోతోంది. ఇటీవ‌ల ఒక ఎంపీ సీటుకు జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కూడా సానుభూతి కోటాలో కూడా బీజేపీ కేవ‌లం ఐదు వేల ఓట్ల తో బ‌య‌ట‌ప‌డింది. సొంత సీటును సానుభూతిలో నిలుపుకోవ‌డానికి కూడా ఆ పార్టీ ఇక్క‌ట్లు ప‌డే స్థితిలో ఉంది.

ఇక సెక్స్ వీడియోల‌ స్కామ్ మ‌రింత ప‌రువు తీసింది. దేశంలోనే అత్యంత ఎక్కువ స్థాయి క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న రాష్ట్రం కావ‌డంతో.. ఈ విష‌యంలోనూ ఫెయిల్ అనే విమ‌ర్శ‌లు తీవ్రం అవుతున్నాయి. ప‌రిస్థితి ఇలా ఉంటే.. సీటు గొడవ గురించిన వార్త‌లు ప్ర‌జ‌ల్లో మ‌రింత అస‌హ‌నాన్ని క‌లిగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.