దేశంలో తయారవుతున్న కో వ్యాగ్జిన్, కోవీషీల్డ్ లు దేశ అవసరాలకు తగ్గట్టుగా వ్యాక్సిన్ ను అందించలేకపోతూ ఉన్నాయి ఇప్పటి వరకూ. ఈ వ్యాక్సిన్లు బ్రహ్మాండంగా పని చేస్తూ ఉన్నాయని, వీటిని వేయించుకున్న వారిపై కరోనా ప్రభావం తక్కువే అని వైద్యులు చెబుతున్నారు.
ఒక డోస్ వేయించుకున్న వారిపైనే కరోనా ప్రభావం తక్కువని అంటున్నారు. ఇక రెండో డోస్ వేయించుకుంటే మరింత రక్ష అని చెబుతున్నారు. అయితే ఒక డోస్ వేయించుకున్న అనేక మందిని కరోనా నీరసపరిచింది. ఇక రెండో డోస్ వేయించుకున్న వారు కూడా కొందరు కరోనా పాజిటివ్ గా తేలారు. అయితే వారిపై వెరీ మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే కనిపించినట్టుగా పరిశీలనలు చెబుతున్నాయి.
ఏదో ఒకటి.. ధైర్యం కోసమైనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి భారతీయులు ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పుడప్పుడే వారి ఆశలు ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ డోసులకూ, అవసరం ఉన్న వాటికీ మధ్యన పొంతన లేదు. రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్ అవసరం అంటుంటే, 20 లక్షల డోసులు అందుబాటులో ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఇక వ్యాక్సిన్ మీద ఇప్పుడిప్పుడే కేంద్రం దృష్టి సారించినట్టుగా ఉంది. అదిగో.. ఇదిగో.. అంటోంది. ఆగస్టు మొదటి వారానికి రోజుకు కోటి డోసుల వ్యాక్సినేషన్ స్థాయికి చేరుకుంటామని కేంద్రం చెబుతోంది. అయితే ఇది మాట మాత్రమే. కనీసం అప్పటికైనా సాధ్యమేనా? అనేది బిగ్ కొశ్చన్.
భారత్ బయోటెక్, సీరమ్ కలిపి మే నెలలో 8 కోట్ల స్థాయిలో వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేశాయట. కో వ్యాగ్జిన్ ఫార్ములాను షేర్ చేస్తారని, వాటి ఉత్పత్తి పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రష్యన్ టీకా అందుబాటులోకి రానుంది. ఇక పాశ్చాత్య దేశాల్లో బాగా వాడుతున్న ఫైజర్ , మోడెర్నాలకు కూడా కేంద్రం మరింతగా లైన్ క్లియర్ చేస్తోంది.
దేశంలో ప్రత్యేకంగా ట్రయల్స్ అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారట. ఇక మిగిలందల్లా వ్యాక్సిన్ దుష్ప్రభావాల విషయంలో మాత్రమే. వాటిపై కూడా కేంద్రం నుంచి తమకు హామీ ఇస్తే ఫైజర్, మోడెర్నాలు ఇండియాకు భారీ ఎత్తున వ్యాక్సిన్ లను సరఫరా చేయనున్నాయట. అయితే.. ఎంత భారీ ఎత్తున అయినా దేశ అవసరాలకు రీచ్ కావడం అంత తేలిక కాకపోవచ్చు.
ఈ ఏడాది చివరకు ఐదు కోట్ల డోసేజ్ లు ఇవ్వగలమని ఫైజర్ చెబుతుండగా, మోడెర్నా మాత్రం ఇండియాకు ఈ ఏడాది తాము సరఫరా చేయలేమని చెబుతోంది. అన్ని లైన్లూ క్లియరైనా.. వచ్చే ఏడాది ఆరంభానికి మాత్రమే ఇండియాకు వ్యాక్సిన్ ఇవ్వగలమని మోడెర్నా చెబుతోందట. దీంతో.. విదేశీ వ్యాక్సిన్లపై భారీ ఆశలు పెట్టుకోవడానికి ఏమీ లేదని స్పష్టం అవుతోంది.
మరోవైపు మరో స్వదేశీ వ్యాక్సిన్ పై కూడా కేంద్రం కసరత్తు సాగిస్తోందట. బయోలాజికల్-ఈ అనే హైదరాబాద్ కేంద్రంగా నడిచే సంస్థ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ఉందని సమాచారం. ట్రయల్స్ విజయవంతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సంస్థతో ఈ ఏడాది చివరకు ముప్పై కోట్ల డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు కేంద్రం ఒప్పందం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.