కష్టాల్లో ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థను కేంద్రం ద్వారా ఆదుకోవడం మాటేమిటో కానీ… భారతీయ జనతా పార్టీ వాళ్లు రాజకీయం అయితే గొప్పగానే చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మీద ఏదో కసి ఉన్నట్టుగా మాట్లాడే కమలం పార్టీ ఏపీ విభాగం నేతలు బలోపేతం గురించి మాత్రం కలలు కంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఒక హీరోయిన్ ని కూడా చేర్చుకుంటున్నారట.
అయితే ఆమె జనాలు మరిచిపోయిన హీరోయిన్. తనే ప్రియా రామన్. ఒకప్పటి ఈ గ్లామర్ డాల్ ను బీజేపీలోకి చేర్చుకోబోతున్నారట. ఆమెను ఏపీ మీద ప్రయోగించబోతున్నారట!
ప్రియా రామన్ కొద్దో గోప్పో చేసింది తమిళ సినిమాలే. తెలుగులో ఆమె నటించింది తక్కువ సినిమాలే. అవి కూడా ఫ్లాపులే! ఆమె తెరమరుగు అయ్యి కూడా చాలాకాలం అయ్యింది. వివాహం చేసుకుని, అనంతరం భర్త నుంచి విడాకులు తీసుకున్న ప్రియా రామన్ ఇప్పుడు మళ్లీ సీరియళ్లలోనూ, టీవీ షోల్లోనూ కనిపిస్తూ ఉంది.
ఈ స్థితిలో ఉండే హీరోయిన్లకు రాజకీయాల మీద గాలిమళ్లడం మామూలే కదా. అందులో భాగంగా ప్రియా రామన్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటోందట. ఇప్పటికే బీజేపీ, డీఎంకేలను తిరిగేసిన ఈ హీరోయిన్ మళ్లీ బీజేపీలోకి చేరి.. ఏపీ రాజకీయం మీద దృష్టి పెట్టబోతోందట!