బిగ్ బాస్ హౌజ్ లోకి భార్యాభర్తలు ప్రవేశించినప్పుడే వ్యవహారం కాస్త తేడాకొట్టింది. చాలామంది అనుమానాలు వ్యక్తంచేశారు. కచ్చితంగా గొడవలు అవుతాయని భావించారు. ఈ అనుమానాలన్నీ నిజమవ్వడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. బిగ్ బాస్ సీజన్-3 ప్రారంభమైన మొదటి వారంలోనే గొడవ షురూ అయింది. తన భార్యను ఏదో అన్నాడంటూ వరుణ్ సందేశ్ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మేటర్ కాస్తా చినికిచినికి గాలివానగా మారింది.
ఎప్పట్లానే బిగ్ బాస్ హౌజ్ లో టాస్క్ లు నడిచాయి. చిన్న చిన్న వాగ్వివాదాలు మినహా హౌజ్ ప్రశాంతంగానే సాగింది. ఇక అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో మహేష్ విట్టా చేసిన ఓ చిన్న కామెంట్ తో హౌజ్ మొత్తం గందరగోళంగా తయారైంది. భార్య వితిక పేరును మహేష్ విట్టా పలికిన తీరు వరుణ్ సందేష్ కు కోపం తెప్పింది.
మహేష్ విట్టా కామెడీగానే అన్నప్పటికీ, స్వయంగా వితికకు భర్త కావడంతో వరుణ్ కు కోపం వచ్చింది. మిగతా సభ్యులంతా మహేష్ విట్టా కామెంట్స్ కు నవ్వుకున్నప్పటికీ వరుణ్ కు మాత్రం కోపం కట్టలుతెంచుకుంది. నా భార్యను ఎందుకలా కామెంట్ చేస్తావ్.. సిగ్గులేదా.. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడం చేతకాదా అంటూ రెచ్చిపోయాడు వరుణ్ సందేష్. ఒకదశలో స్వయంగా వితిక వచ్చి భర్తను సముదాయించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
దమ్ముంటే నన్ను కొట్టు నీ సంగతి తేలుస్తా అంటూ వరుణ్ సందేష్ అనడం గొడవను మరింత పెద్దది చేసింది. హౌజ్ లో సభ్యులంతా గ్రూపులుగా విడిపోయి ఇద్దర్నీ చెరోవైపుకు తీసుకుపోవడంతో గొడవ సద్దుమణిగించింది. అయితే ఇది ఇక్కడితో పూర్తయిపోలేదు. వివాదాల్నే హైలెట్ చేసి చూపించే బిగ్ బాస్ కార్యక్రమం.. ఈ వీకెండ్ నాగార్జున ముందుకు ఈ పంచాయితీని తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ వివాదంపై నాగార్జున కచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. అసలే బిగ్ బాస్ హౌజ్. పైగా భార్యాభర్తల వ్యవహారం. ప్రారంభమైన రెండో వీకెండ్ కే నాగార్జునకు క్లిష్టమైన పని పడేట్టుంది. గతంలో ఇలాంటి సున్నితమైన వివాదాల కారణంగానే నానిపై ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు నాగ్ కూడా అలానే బుక్ అవుతాడేమో. దీన్ని తన సీనియారిటీతో నాగార్జున ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.