కేంద్రం ప్లాన్‌తో రాయలసీమ నోట మట్టి!

సాగునీటిపరంగా రాయలసీమ ప్రాంతానికి అన్ని రకాలుగానూ తొలినుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. నదులు సమృద్ధిగా లేని లేమితనం సీమకు పుష్కలం. ప్రాజెక్టులు, కాలువలు ఎన్నివస్తున్నా.. సీమ సాగునీటి దాహార్తిని మాత్రం తీర్చలేకపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో…

సాగునీటిపరంగా రాయలసీమ ప్రాంతానికి అన్ని రకాలుగానూ తొలినుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. నదులు సమృద్ధిగా లేని లేమితనం సీమకు పుష్కలం. ప్రాజెక్టులు, కాలువలు ఎన్నివస్తున్నా.. సీమ సాగునీటి దాహార్తిని మాత్రం తీర్చలేకపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చాలినంత కాకపోయినా.. కొంతమేరకు వారికి సాగునీటి వసతి కల్పించడానికి ఒక ఆలోచన జరుగుతున్న సమయంలోనే… దానికి నష్టం చేసేలా.. కేంద్రం ఆలోచనలు సాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి… గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయరుకు తరలించే ఆలోచన చేశారు. కాలువల్తో శ్రీశైలం వరకు తెచ్చి… అక్కడ కృష్ణ ప్రవాహంలో కలిపేస్తే.. ఇక శ్రీశైలం రిజర్వాయరు నుంచి కృష్ణ నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరం ఉండదు అనేది ప్రతిపాదన. అందువలన… రిజర్వాయరులోని నీటిని మరింతగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు విడుదల చేయవచ్చుననేది ఆలోచన. ఇందువల్ల రాయలసీమకు కలిగే లబ్ధి పరిమితమే. తెలంగాణకే ఎక్కువ లాభం జరుగుతుంది. సీమకు గుడ్డికంటె మెల్ల మేలన్నట్లుగా ఎంతోకొంత లాభం ఉంటుంది.

కానీ.. ఇప్పుడు గోదావరిని నాగార్జున సాగర్ వరకు తెచ్చి కృష్ణలో కలిపి అక్కడినుంచి కావేరిలో కలపడానికి కేంద్రప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన అతి భారీ ప్రాజెక్టే. కాకపోతే.. ఈ ప్రాజెక్టువల్ల ప్రస్తుతం కేసీఆర్-జగన్ కలిసి ఆలోచన చేస్తున్న పథకం ఆగిపోతుందా… లేదా, రెండూ ఒకదానికొకటి సంబంధం లేకుండా సాగుతాయా? అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది.

ఒకటి మాత్రమే కార్యరూపం దాల్చేట్లయితే… ఈ కేంద్రం ఆలోచన వలన లక్షకోట్లతో మూడు ప్రధాన నదుల అనుసంధానం అనేది జరుగుతుంది గానీ… దానివలన కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి గానీ.. రాయలసీమకు మాత్రం నోట మట్టే. కేంద్రం ప్లాన్ లో తెలంగాణలోని జానంపేట నుంచి సాగర్ కు గోదావరిని తరలిస్తారు. అక్కడినుంచి సోమశిల మీదుగా కావేరికి తరలిస్తారు.

దీనివలన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మాత్రం కొంతమేరకు సాగునీటివసతి ఏర్పడుతుంది. రాయలసీమజిల్లాల పరిస్థితిలో ఏమాత్రం మార్పురాదు. ఇప్పుడున్న దురవస్థలోనే మగ్గిపోతుంటారు. అలాకాకుండా.. రెండు పథకాలూ గనుక కార్యరూపం దాలిస్తే.. అంతోఇంతో సీమకు మేలు జరుగుతుంది. 

రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తున్నా.. సైరా డైరెక్టర్