జగన్ పాలనలో ప్రాంతీయ సమన్యాయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు గానీ, రెండుముక్కలు అయినతర్వాత గానీ.. రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉన్నదనే అభిప్రాయం ఆ ప్రాంతవాసుల్లో చాలామందిలో ఉంది. పేరుకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లు ఆ ప్రాంతపు నాయకులే అయినప్పటికీ..…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు గానీ, రెండుముక్కలు అయినతర్వాత గానీ.. రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉన్నదనే అభిప్రాయం ఆ ప్రాంతవాసుల్లో చాలామందిలో ఉంది. పేరుకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లు ఆ ప్రాంతపు నాయకులే అయినప్పటికీ.. రాయలసీమ మాత్రం.. తతిమ్మా ప్రాంతాలతో పోలిస్తే సమంగా అభివృద్ధి చెందలేదన్నది సత్యం. అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఆలోచన చేయడం ద్వారా… జగన్మోహన రెడ్డి సీమ ప్రాంతానికి సమన్యాయం చేయడానికి కొంత ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిపాదన ఆ ప్రాంత వాసులకు అలవిమాలిన ఆనందం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. భాషాప్రయుక్తంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాడే.. ఉత్తరాంధ్ర- కోస్తాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు సమన్యాయం జరగాలనే ప్రతిపాదనలు అప్పట్లో శ్రీబాగ్ ఒప్పందంలో భాగాలుగానే ఉన్నాయి.

అలాంటి ప్రాంతీయ సమన్యాయం చేయడానికే విశాఖకు ఆంధ్ర యూనివర్సిటీ, గుంటూరులో హైకోర్టు, కర్నూలులో రాజధాని ఏర్పాటయ్యాయి. హైదరాబాదు, తెలంగాణలో ఆంధ్రలో విలీనం అయి… ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత.. ప్రాంతీయ అసమానతలను పట్టించుకోకుండా చాలా గుడ్డిగా సకలం అన్ని వ్యవస్థలనూ హైదరాబాదులోనే కొలువు తీర్చారు. ఫలితమే రాష్ర్ట విభజన.

ఆ తర్వాత అయినా.. పాతకాలంనాడే పెద్దలు సూచించినట్లుగా ప్రాంతీయ సమన్యాయం ఉంటుందని ఆశిస్తే.. చంద్రబాబు ఆ ఆశలకు గండికొట్టారు. రాజధాని అమరావతిలో పెడితే.. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని అంతాకోరారు. కానీ చంద్రబాబు సకలం అమరావతిలోనే అన్నట్లుగా ఒంటెత్తుపోకడలకు వెళ్లారు. అసలే అన్ని రకాలుగా వెనుకబాటుతోతనంతో ఉన్న సీమవాసులకు మరింత అసంతృప్తి మిగిలింది.

ఇప్పుడు రాజేంద్రనాధ్ రెడ్డి.. సీమలో హైకోర్టు ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నాం అంటున్నారు. ఇది ఆ ప్రాంత వాసులకు కొంత ఊరట కలిగిస్తుంది. చంద్రబాబు చేసిన ద్రోహానికి ఇది నివృత్తి అవుతుంది. రాష్ట్ర అభివృద్ది అంటే.. ఒక ఊరిని వృద్ధి చేయడం కాదని… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమతుల్యంతో ముందుకు తీసుకెళ్లాలని నిరూపణ అవుతుంది.

రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తున్నా.. సైరా డైరెక్టర్