టీడీపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ స్ట్రాటజీ టీమ్ లీడర్ రాబిన్‌శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసేందుకు రూ.450 కోట్ల ప్యాకేజీకి ఒప్పందం కుదిరిందని, అందుకు తగ్గట్టు క్షేత్రస్థాయిలో తాము పని చేస్తున్నట్టు రాబిన్‌శర్మ టీం సభ్యులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో లోతైన పరిశీలన, అభిప్రాయాలు సేకరించి పార్టీకి నివేదికలు సమర్పిస్తున్నామని, కానీ అటు వైపు నుంచి అందుకు తగ్గట్టు చర్యలు కనిపించడం లేదని రాబిన్‌శర్మ టీం వాపోతోంది.
తాము చెప్పినట్టు నడుచుకోకపోతే, ఇక తాము సర్వేలు చేసి నివేదికలు సమర్పించినా ప్రయోజనం ఏంటనే ప్రశ్న స్ట్రాటజీ టీం నుంచి వస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు టీడీపీ నాయకులు టికెట్ ఆశిస్తున్నారని, వాళ్లలో ప్రజల్లో పట్టున్న నాయకుల గురించి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నివేదికలు సమర్పిస్తున్నట్టు రాబిన్‌శర్మ టీం సభ్యులు చెబుతున్నారు.
కానీ అభ్యర్థుల ఎంపిక విషయానికి వస్తే .. ప్రజాదరణ లేదని నివేదికలు ఇచ్చిన నేతలకు, సామాజిక సమీకరణల పేరుతో కట్టబెడుతున్నారని రాబిన్‌శర్మ టీం చెబుతోంది. దీంతో తమ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోందని టీం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దఫా ఎన్నికలు టీడీపీకి చావోరేవో అని, అలాంటప్పుడు ప్రతి అభ్యర్థి ఎంపిక అత్యంత కీలకమని వారు చెబుతున్నారు.
ఒక పార్టీ విజయానికి అభ్యర్థుల ఎంపిక ముఖ్యమైందని, అలాంటప్పుడు తమకిష్టమైన వాళ్లకు టికెట్లు కట్టబెట్టేందుకైతే తమకు సర్వే బాధ్యతలు ఎందుకు అప్పగించారని వారు నిలదీస్తున్నారు. ఇప్పుడు కొత్తగా జనసేనతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నట్టు రాబిన్‌శర్మ టీం పేర్కొంది. జనసేన, టీడీపీ మధ్య ఓట్ల బదిలీ దేవుడెరుగు, పరస్పరం వెన్నుపోటు పొడుచుకునేందుకు ఇరుపార్టీల నాయకులు సిద్ధమవుతున్నారని సర్వే టీం తెలిపింది.
టీడీపీ స్వీయ తప్పిదాలే ఆ పార్టీ కొంప ముంచే ప్రమాదం ఉందని రాబిన్‌శర్మ టీం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కోట్లాది రూపాయలు తమకు కట్టబెట్టి, చివరికి ఓడిపోతే ఆ నింద తమపై వేస్తారనే అనుమానాన్ని ఆ టీం వ్యక్తం చేస్తోంది. గతంలో ప్రశాంత్ కిశోర్ టీం చెప్పినట్టు వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకోవడం వల్లే సానుకూల ఫలితాలు వచ్చాయని వారు గుర్తు చేస్తున్నారు.
టీడీపీలో అలాంటి పరిస్థితి అసలు కనిపించడం లేదని, గెలుపుపై గ్యారెంటీ ఇవ్వలేమని ఆప్ ది రికార్డ్‌గా రాబిన్‌శర్మ టీం సభ్యులు ఆ పార్టీ నాయకుల వద్ద తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు.