నిజానికి వారు తొలినుంచి తెగ ఉడికిపోతున్నారు. అధికారం తమకు దక్కినట్టే దక్కి… చేజారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా.. ప్రభుత్వాన్ని కూల్చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పు కొంత తమకు అనుకూలంగా కనిపించేసరికి… ఇక రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. కర్నాటకలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని అర్థంతరంగా కూల్చేయడానికి కమలదళం గోతులు తవ్వడం ప్రారంభించినట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత.. అధికారానికి దూరంగా ఉండవలసి రావడం భారతీయ జనతా పార్టీకి పుండుమీద కారం రాసినట్లుగానే ఉంటూ వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా.. ఫిరాయింపులకు వారు అనేక తెరవెనుక ప్రయత్నాలుసాగించారు. ఏవీ నిర్దిష్టంగా ఫలించలేదు.
ఇప్పుడిక పార్లమెంటు ఎన్నికల్లో కర్నాటకలో భాజపా గాలి బాగానే వీస్తున్న సంకేతాలు కనిపించాయి. ప్రత్యర్థులు ఇదంతా కూడా ఈవీఎంల మాయాజాలమే అని ఆరోపణలు చేస్తున్నప్పటికీ… భాజపాకైతే మెజారిటీ సీట్లు దక్కాయి. కన్నడసీమలో ప్రజాభిప్రాయం భాజపాకు అనుకూలంగా మారుతున్నదని ప్రచారం చేసుకోవడానికి వారికి అవకాశం దక్కింది. దీనిని మరింత సద్వినియోగం చేసుకుని ఇప్పుడు ఫిరాయింపులకు ఎగబడితే.. ఇక తమను ఎవరూ తప్పుపట్టకపోవచ్చునని వారు గేరప్ అవుతున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా కమలప్రభంజనం కనిపించిన వేళ… అధికార కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడుతున్నారని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే.. కమల సారథ్యమే కావాలనే ఉద్దేశంతో తమవైపు చూస్తున్నారని చాటుకోవాలనేది భాజపా ప్లాన్. ఇన్నాళ్లూ చాటు మాటు వ్యవహారాలుగా ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టిన కన్నడకమలాలు.. ఇక నేరుగానే కుమారస్వామి సీటుకింద గోతులు తవ్వడానికి చూస్తున్నారని అర్థమవుతోంది.
ఏడాదిలోగా కుమారస్వామి సర్కారు కూలిపోతుందని ఆ రాష్ట్ర ఇన్చార్జి మురళీధరరావు అంటున్నారు. కానీ వాస్తవంలో అంతకంటె ముందుగానే ప్రభుత్వాన్ని కూల్చేసి గద్దెమీదకు రావడానికి యడ్యూరప్ప రెడీ అయిపోతారని పలువురు భావిస్తున్నారు.
తండ్రీ కొడుకులు సాకులు వెతుకుతున్నారు