ఫలక్ నుమా దాస్ కాదు.. దర్శకుడు సుకుమార్ ను అంతా ఇప్పుడు ఫలక్ నుమా సుక్కూ అని కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మద్దతుగా సుకుమార్ మాట్లాడ్డమే అతడు చేసిన తప్పు. ఫలక్ నుమా దాస్ పై ప్రశంసలు కురిపించిన సుకుమార్, ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'ఎ' సర్టిఫికెట్ ఎందుకిచ్చిందో తెలియడం లేదని, సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన డైలాగ్ లు కానీ, సీన్లు కానీ లేవని తన సొంత సర్టిఫికెట్ ఇచ్చాడు.
సినిమా బాగుంది అంటే సరిపోయే దానికి డైలాగులు, సెన్సార్ బోర్డ్ అంటూ.. నోరుజారి ఇబ్బందుల్లో పడ్డారు సుకుమార్. ప్రస్తుతం దాస్ తో పాటు.. సుకుమార్ పై కూడా ట్రోలింగ్ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బూతులు మాట్లాడిన హీరో విశ్వక్ సేన్ ను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. మొదటి సినిమాకే అంత యాటిట్యూడ్ పనికిరాదంటూ గడ్డి పెడుతున్నారు. దీనికితోడు సుకుమార్ సినిమాకు మద్దతిచ్చేసరికి అతడు కూడా టార్గెట్ అయ్యాడు. ఫలక్ నుమా సుక్కూ అంటూ ట్రోలింగ్ షురూ చేశారు.
ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ దృష్టిలో బ్యాడ్ అయ్యాడు సుకుమార్. లెక్కప్రకారం మహేష్ తో ఓ సినిమా చేయాలి. కానీ మహేష్ టైమ్ తీసుకోవడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా బన్నీతో సినిమా ప్రకటించాడు. ఈ చర్య మహేష్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. సుక్కూ ఎప్పుడు దొరుకుతాడా అని వాళ్లంతా ఎదురుచూస్తున్న టైమ్ లో ఫలక్ నుమా దాస్ సినిమాతో దొరికిపోయాడు. అంతే, మహేష్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో సుకుమార్ ను చెడుగుడు ఆడేసుకుంటున్నారు.
నిజానికి ఈ సినిమాకు మద్దతుగా కొందరు సినీప్రముఖులు బైట్లు ఇచ్చారు. లెక్కప్రకారం అవన్నీ ఇవాళ్టి నుంచి టీవీల్లో ప్రసారం అవ్వాలి. కానీ తాజా వివాదాల కారణంగా తమ బైట్స్ అన్నీ ఆపేయాలని, ఎక్కడా ప్రసారం చేయొద్దని యూనిట్ కు వాళ్లకు సమాచారం అందించారు. ఇదంతా కేవలం విశ్వక్ సేన్ పొగరుబోతుతనం వల్లనే జరిగింది. అతడు ఇనస్టాగ్రామ్ లో బూతులు మాట్లాడకుండా ఉండుంటే ఇంత జరిగేది కాదు.