ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత. అలాగే ఇంట్లోనే సైంధవులుంటే.. ఇక రాగలిగేది కూడా ఎలా వస్తుంది? దక్కగలిగేది ఎలా దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చేటు చేసే సైంధవులు బయటలేరు.. రాష్ట్రంలోనే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు వాళ్లే మోకాళ్లడ్డుతుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రత్యేకహోదా గురించి కేంద్రానికి లేఖ రాసిన తర్వాత.. భాజపా నాయకుడు, ఏపీకే చెందిన వాడు, ఎంపీ జివిఎల్ నరసింహారావు మాట్లాడుతున్న మాటలు చూస్తే అలాగే అనిపిస్తోంది.
15వ ఆర్థిక సంఘం ఇటీవల ఒక విషయం స్పష్టం చేసింది. ప్రత్యేకహోదా అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోని వ్యవహారమేనని, పలురాష్ట్రాలు దానికోసం డిమాండు చేస్తున్న సమయంలో స్పష్టత ఇచ్చింది. వారి ప్రకటన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. తమకు ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. కాగా ఈ ఎపిసోడ్ లో మధ్యలో జీవీఎల్ తల దూర్చడమే తమాషా.
హోదా అనే లేని వ్యవస్థపై మాట్లాడితే.. రాజకీయంగా ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరిస్తున్నారు. పాత సర్కారులాగే అది జగన్ మెడకు చుట్టుకుంటుందని ఆయన అంటున్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పాచిపోయిన బొంకుల పాటను కూడా ఆయన మరోసారి వినిపించారు.
నికార్సుగా ఎన్నికల్లో నిలబడితే పట్టుమని పది ఓట్లు సంపాదించుకోలేని నాయకులంతా రాజ్యసభకు ఎంపికైపోయి.. పార్లమెంటు సభ్యుల హోదాలో ప్రకటనలు గుప్పిస్తుండడం మనకు కొత్త కాదు.
అదలా ఉంటే.. ఒక ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాస్తే.. ఒక ఎంపీ.. తలదూర్చి ఈ బెదిరింపు డైలాగులు వేయడం ఏమిటో అర్థంకాని సంగతి. కేంద్రం ఇస్తే ఇస్తుంది.. లేకపోతే లేదు.. మధ్యలో ఈయన బెదిరించడం ఏమిటి? హోదాను పదేళ్లపాటు ఇస్తాం అని ప్రకటించి.. వంచించినందుకు భాజపాకు ఏపీలో పుట్టగతులు లేకుండాపోయిన సంగతి జీవీఎల్‌కు గుర్తుందో లేదో? ఇప్పుడు మళ్లీ ఇలాంటి హెచ్చరికలతో ముందుకు వస్తే.. ఆ ఎఫెక్టు పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
గూగుల్‌లో ఎంత సెర్చ్ చేసినా ఒక్క అమ్మాయితో కూడా లింకప్ రావట్లేదు