'రోజులో నాలుగు గంటలు సినిమా కోసం సమయం కేటాయించి.. మిగిలిన సమయంలో 16 నుంచి 18 గంటలు కేవలం పార్టీ గురించి మాత్రమే ఆలోచిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆయనెంత కష్టపడుతున్నారో తెలుసా.? ప్రజల కోసమే ఇన్ని కష్టాలూ అనుభవిస్తున్నారు..' అంటూ ఈ మధ్యనే జనసేన అధినేత గురించి ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ఓ ఇంటర్వ్యూలో పెద్ద ఉపన్యాసమే దంచేశారు.
అయితే, క్రమక్రమంగా జనసేన కార్యకలాపాలు మంగళగిరి నుంచి హైద్రాబాద్‌కి తరలి వెళ్ళేలా కన్పిస్తోంది వ్యవహారం. కర్నూలు జిల్లాకి సంబంధించి మూడు నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమావేశాన్ని హైద్రాబాద్‌లో డిసైడ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పైగా, 'కార్యకర్తలు, నేతల కోరిక మేరకు..' అని చెప్పుకొచ్చారు. కర్నూలుకి హైద్రాబాద్ పెద్ద దూరమేమీ కాదు. ఓ రెండొందల కిలోమీటర్లు. అమరావతితో పోల్చితే కర్నూలుకి హైద్రాబాదే తక్కువ.
అయినా, కర్నూలు జిల్లా నేతలు, కార్యకర్తలతో మాట్లాడేందుకు కర్నూలుకి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చు కదా.? అలాగైతే హైద్రాబాద్‌కి కర్నూలు బాగా దగ్గరవుతుంది కూడా.! కానీ, ఇక్కడ సమస్య వేరు. మూడు రాజధానుల చర్చ జరుగుతున్న వేళ, 'ఒకే ఒక్క రాజధాని అమరావతి వుండాలి' అనే నినాదాన్ని జనసేనాని నెత్తికెత్తుకున్నారు. అదే అసలు సమస్య. కర్నూలో మీటింగ్ పెడితే, ఖచ్చితంగా సెగ తగులుతుంది.
అదే హైద్రాబాద్‌లో సమావేశం పెడితే, పవన్ కళ్యాణ్‌కి సమయం కలిసొస్తుంది.. ఎందుకంటే, ఆయన వరుస సినిమాల షూటింగులతో హైద్రాబాద్‌లో బిజీగా వున్నారు. కర్నూలు జిల్లాకి సంబంధించిన సమావేశాలే కాదు, ఇకపై మరిన్ని సమావేశాలు హైద్రాబాద్‌లోనే జరిగేలా పార్టీ యంత్రాంగం తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా హైద్రాబాద్‌లో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తే, సినిమాల షూటింగులు జరిగినన్నాళ్ళూ జనసేనానికి వెసులుబాటు వుంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందిట. అంటే, పాక్షికంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తన రాజకీయ మకాం మంగళగిరి నుంచి హైద్రాబాద్‌కి మార్చనున్నట్టే కదా.!