అలా చేసి ఉంటే మీ పరువు దక్కి ఉండేదిగా!

తెలుగు తమ్ముళ్లు గవర్నరును కలిశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తమ కళ్ల ముందున్న అత్యంత ప్రాధాన్యతాంశం.. చంద్రబాబు ఇల్లు మునిగిపోయే దుస్థితి, దాని మీద డ్రోన్లతో తనిఖీ అనేది మాత్రమే అని వారు……

తెలుగు తమ్ముళ్లు గవర్నరును కలిశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తమ కళ్ల ముందున్న అత్యంత ప్రాధాన్యతాంశం.. చంద్రబాబు ఇల్లు మునిగిపోయే దుస్థితి, దాని మీద డ్రోన్లతో తనిఖీ అనేది మాత్రమే అని వారు… నిస్సంకోచంగా అక్కడ చాటుకున్నారు. ప్రజల సమస్యలు వారికి పట్టలేదు. ‘లోతట్టు ప్రాంతాలను పట్టించుకోలేదు’ అనే పడికట్టు మాటతప్ప.. గవర్నరుకు రాష్ట్రంలో ఇతర వ్యవహారాల గురించి వారేమీ నివేదించినట్లు లేదు. ప్రకాశం బ్యారేజీనుంచి నీటిని విడుదల చేయడమే చంద్రబాబు ఇంటిని ముంచేయడానికేనని.. ఒక అసంబద్ధమైన, హాస్యాస్పదమైన ఆరోపణ చేయడం మినహా వారు గవర్నరుకు మరేమీ చెప్పలేకపోయారు.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జాగు చేస్తున్నందువలన.. ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాలు వేరే ఉన్నాయి కూడా. ఫరెగ్జాంపుల్ ఇసుక వ్యవహారమే కావొచ్చు… అయిదు రూపాయలకు అన్నం పెట్టే క్యాంటీన్లను మూసివేయడమే కావొచ్చు. వీటిగురించి ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర ప్రథమపౌరుడికి నివేదించి ఉంటే.. ప్రజల సమస్యల పట్ల వారు శ్రద్ధగా ఉన్నట్లు ప్రజలు కూడా గుర్తించి ఉండేవారు. కానీ.. పచ్చ దళాలకు అలాంటి స్పృహ కలిగినట్లు లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల ముందున్న అజెండ్ ఒకే ఒక్కటి. దానికి కారణం కూడా ఒకే ఒక్క భయం. చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు.. కృష్ణానదిని ఆక్రమించి కట్టినది.. ముంపు ప్రమాదం గల ప్రాంతంలోనే అది ఉన్నది అనే సంగతి ఈ వరదల్తో ప్రజలందరికీ విపులంగా కళ్లకు కట్టినట్టు తెలిసిపోయింది. కనీసం ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ అయినా తలదాచుకుని, చంద్రబాబు ఇక్కడే ఉండిఉంటే కాస్త పరువు దక్కేదేమో.

కానీ ఆయన పలాయనం చిత్తగించి.. రాష్ట్రం వరదల్లో ఉంటే, ఆయన హైదరాబాదులో తిష్టవేశారు. ఇదేమాట వారు జగన్ ను కూడా విమర్శించవచ్చు. జగన్ ఒక్కడూ భౌతికంగా దూరంగా ఉన్నా.. మంత్రులంతా సహాయ చర్యల వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. కానీ తెలుగుదేశం దళాలు సమస్తం చంద్రబాబు ఇంటిచుట్టూ గుమికూడా పోలీసులపై రౌడీయిజం చెలాయిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు కనీసం.. ఇలాంటి డ్రోన్ సమస్యతో కాకుండా.. కనీసం అయిదు రూపాయల భోజన క్యాంటీన్ల సమస్యనైనా గవర్నరు దృష్టికి తీసుకెళ్లి ఉండాల్సింది.

కనీసం డ్రోన్ల గొడవతో పాటు దానిని కూడా ప్రస్తావించి ఉండాల్సింది. కానీ వారు అలా చేయలేదు. ప్రజల్లో తమ పరువు నిలబెట్టుకునే ఆలోచనలేవీ వారికి వస్తున్నట్లు లేదు.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!