ఎన్నికల తర్వాత తెభాజపా చీలుతుందా?

నిజానికి ఇది ఊహాజనితమైన అంశం. కానీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న అంశం కూడా! ఎందుకంటే తెలంగాణ ఎన్నికల బరిలో తలపడుతున్న పార్టీలు అన్నీ.. ఊహాజనితమైన అంశాల ఆధారంగానే తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి.  Advertisement…

నిజానికి ఇది ఊహాజనితమైన అంశం. కానీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న అంశం కూడా! ఎందుకంటే తెలంగాణ ఎన్నికల బరిలో తలపడుతున్న పార్టీలు అన్నీ.. ఊహాజనితమైన అంశాల ఆధారంగానే తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. 

కాంగ్రెస్ గెలిస్తే ధరణిని తొలగిస్తారని కేసీఆర్ ఒక ఊహను, కాంగ్రెస్ సీట్లు ఎక్కువ వస్తే.. వాళ్లు భారాసలో చేరుతారని బిజెపి మరో ఊహను.. ఇలా రకరకాల ఊహలను ప్రచారం చేసుకుంటూ రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో.. బిజెపి మాత్రం ఏ రకంగా ప్రత్యేకమైన పార్టీ! ఎలాంటి కాంబినేషన్ ఫలితాలు వచ్చినా.. ఎన్నికల తర్వాత భాజపా చీలకుండా ఉంటుందా? అనే చర్చోపచర్చలు ఇప్పుడు నడుస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ- భారత రాష్ట్ర సమితి మధ్య లోపాయికారీ కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలంగాణ సమాజం నమ్ముతోంది. పరోక్షంగా కేసీఆర్ విజయం సాధించడానికి తగ్గట్టుగానే.. బిజెపి పావులు కదుపుతోందన్నది చాలా మంది నమ్ముతున్న సంగతి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ఒక్కటే లక్ష్యంగా భాజపా వ్యవహరిస్తోంది. జనసేన తమ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఇన్ని సంవత్సరాలుగా.. పవన్ కల్యాణ్ ను గానీ, ఆ పార్టీని కనీసం మిత్రులుగా గుర్తించకుండా చులకనగా చూసిన తెలంగాణ బిజెపి.. ఎన్నికలు వచ్చాక వారిని దగ్గరకు చేర్చడంలోని మర్మం కూడా అదేనని పలువురు అంటున్నారు.

బిజెపికి సొంతంగా పోటీచేయాలంటే.. రాష్ట్రమంతా చాలినంత బలం లేదు. తమకు అస్సలు ఠికానా లేని ఖమ్మం వంటి చోట్ల కొన్ని సీట్లను జనసేన కు ఇచ్చేసి.. తద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా వ్యూహరచన చేశారనేది అందరూ నమ్ముతున్న సంగతి.

అదే సమయంలో మరో విశ్లేషణ నడుస్తోంది. కేసీఆర్ కు సింపుల్ మెజారిటీకి తగినన్ని సీట్లు రాకపోతే.. ఎటూ ఎంఐఎం వారు 7 స్థానాల్లో గెలిస్తే మద్దతు ఇస్తుంది. అప్పటికీ మెజారిటీ చాలకపోయేట్లయితే గనుక.. బిజెపి తాము గెలిచేసీట్లను కూడా మద్దతిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. బిజెపి చీలడం కూడా తథ్యం అని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే, బిజెపి తరఫున గెలిచే కొందరు నాయకులు.. కేసీఆర్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నవారు. వారికి అన్నింటికంటె కేసీఆర్ మీద ద్వేషమే ముఖ్యం. అలాంటప్పుడు.. గెలిచిన తర్వాత.. కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేయడానికి తాము దోహదం చేస్తామని బిజెపి పూనుకుంటే గనుక.. అలాంటివారు పార్టీని వీడి కాంగ్రెసు వైపు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. సో, ఎన్నికల తర్వాత బిజెపి చీలడానికి చాలా అవకాశాలున్నాయని పలువురు అంటున్నారు.