చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై పెద్ద చర్చే జరుగుతోంది. బాబు సీట్లోకి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనకు తానుగా రావడం టీడీపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపై తాను ప్రజల్లోకి వస్తున్నానని బాలయ్య ప్రకటించడం టీడీపీలో చర్చనీయాంశమైంది. మరోవైపు లోకేశ్‌కు అంత సీన్ లేదనే చర్చ నడుస్తోంది. తాజాగా టీడీపీ పొలిటికల్ యాక్షన్ టీమ్ ఏర్పాటైంది.
నిజానికి చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే సమర్థుడైన నాయకుడు లేకపోవడం వల్లే 14 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందనేది పార్టీ వర్గాలు అంటున్న మాట. టీడీపీ సారథ్య బాధ్యతలు స్వీకరించాలని బాలయ్య తహతహలాడారు. ఇప్పటికీ ఆయనకు ఆ కోరిక బలంగా వుంది. కానీ బాలయ్య నాయకత్వం టీడీపీకి వద్దే వద్దని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకాయన ఇటీవల ములాఖత్‌లో చంద్రబాబుకు తేల్చి చెప్పినట్టు సమాచారం.
బాలయ్యకు టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే, ఓడించడానికి వైఎస్ జగన్ అవసరం లేదని చంద్రబాబుతో ఆయన కాస్త కఠినంగానే తన వ్యతిరేకతను చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. సదరు నాయకుడంటే బాబుకు గురి వుండడం వల్లే పొలిటికల్ యాక్షన్ టీమ్ ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.
బాలయ్యకు వయసు పెరిగిందే తప్ప, బుద్ధి వికసించలేదని… ఈ సందర్భంగా చంద్రబాబుకు కొన్ని ఉదాహరణలను సదరు నాయకుడు వివరించినట్టు చెబుతున్నారు. దీంతో బాలయ్యను అత్యవసరంగా పక్కన పెట్టడానికే యాక్షన్ టీమ్ ముందుకొచ్చింది. ఇంతకూ బాలయ్య నాయకత్వాన్ని అడ్డుకున్న ఆ నాయకుడెవరో టీడీపీలో అందరికీ తెలుసు.
యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆ సీనియర్ నేత.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో బాబుకు అండగా నిలిచారు. నాడు అసెంబ్లీలో ఎన్టీఆర్‌కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వని ఆ నాయకుడు, ఇపుడు ఏకంగా బాలయ్య నాయకత్వాన్నే వద్దని శాసించే స్థాయిలో ఉండడం గమనార్హం.