తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు… ఇవాళ్టి నుంచి రాష్ట్రమంతా 175 నియోజకవర్గాలూ తిరిగేయడానికి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. దానికరి ప్రజా చైతన్య యాత్ర అని పేరు పెట్టారు. ఈ తొమ్మిది నెలల కాలంలో జగన్ ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రచారం చేయడానికి వారు ఉత్సాహపడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది.. కానీ.. చంద్రబాబు కలిగించే చైతన్యానికి… తెలుగు తమ్ముళ్లు మాత్రం బెంబేలెత్తుతున్నారు. చంద్రబాబు బస్సుయాత్రలకు జనాన్ని తరలించడమూ, వారికి కావాల్సిన సదుపాయాలు చూడడమూ అంతా స్థానిక నియోజకవర్గ ఇన్చార్జిలతే బాధ్యత కావడంతో.. ఖర్చు గురించి వారు భయపడిపోతున్నారు.
గత అయిదేళ్లలో ఎక్కడికక్కడ ఎడాపెడా దోచుకోవడానికి చంద్రబాబు ఆస్కారం కల్పించినప్పటికీ.. ఎన్నికల సమయంలో.. అందరితోనూ చాలా భారీగా ఖర్చు పెట్టించారనే అభిప్రాయం స్థానిక నాయకుల్లో ఉంది. అడ్డదారి సంపాదనలన్నీ ఆగిపోయాయి. ఇసుక దోపిడీలు తగ్గిపోయాయి. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాం. ఇప్పట్లో కోలుకుంటామనే నమ్మకం కూడా కనిపించడం లేదు. అయినా ఇప్పుడు కూడా.. పార్టీ కార్యక్రమాలకు అంతో ఇంతో ఖర్చు చేస్తూనే ఉన్నాం. చంద్రబాబు చైతన్య యాత్ర రేంజి లో ఏర్పాట్లు చేయాలంటే.. జనాన్ని తరలించాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని పలువురు నాయకులు ఆవేదన చెందుతున్నారు.
ప్రకాశం జిలాల్లో తొలిరోరజు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ చంద్రబాబునాయుడు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్ర మొత్తం 45 రోజుల పాటుసాగుతుంది. యాత్రకోసం పాంప్లెట్లు, స్టిక్కర్లు అన్నీ సిద్ధం చేశారు. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం నుంచి నవరత్నాలు అనేదే కీలకమైన ప్రజాకర్షక హామీ కావడంతో.. దానిని కౌంటర్ చేయడానికి ఈ యాత్ర ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. నవభారాలు, నవ మోసాలు ప్రజలకు ఈ నవమాసాల్లో దక్కాయంటూ.. కాన్సంట్రేషన్ మొత్తం జగన్ వైఫల్యాలను ఎండగట్టడం అనేదిశగా పెడుతున్నారు.
చంద్రబాబు ఇటీవల అమరావతి అంశాన్ని నెత్తికెత్తుకుని తిరుపతి, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో భిక్షాటనలు సాగించారు. ఆయన కార్యక్రమాలకు ప్రజల స్పందన చాలా పలచగా కనిపించింది. ఆ నేపథ్యంలో.. చైతన్య యాత్రలకు జనసమీకరణ బాగా ఉండాలని స్థానిక నాయకులకు ఆదేశాలు వెళ్లాయి. అందుకే అందరూ జడుసుకుంటున్నారు. కాగల ఖర్చు తలచుకుంటే తమ్ముళ్ల గుండె గుభేలుమంటోంది.