Advertisement

Advertisement


Home > Politics - Gossip

వాళ్ల నిర్ణయాలూ చంద్రబాబు పతనంలాగానే!?

వాళ్ల నిర్ణయాలూ చంద్రబాబు పతనంలాగానే!?

చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రంలో  తెలుగుదేశం పార్టీని సమూలంగా సమాధి చేసేయగలిగారు. ఇది అంత సులభంగా ఆయన చేయలేదు. నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం గల తన అపర చాణక్య తెలివితేటల గురించి అతిగా చెప్పుకునే ఆయన తీసుకున్న అసాధారణ నిర్ణయాల వల్లనే ఆ పార్టీ సమాధి అయిపోయింది. చూడబోతే.. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అలాంటి నిర్ణయాలనే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

మరి వారు పతనం అవుతారో.. నిలబడగలరో అప్పుడే తెలియదు. తమ పార్టీ మూలాల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకత అనే మౌలిక భావజాలాన్ని తొక్కిపట్టి.. ఆ పార్టీతో జట్టు కట్టడానికి సిద్ధపడడమే మొన్న చంద్రబాబు, ఇవాళ శివసేన చేస్తున్న కామన్ తప్పుగా కనిపిస్తోంది.

బాలథాకరే ఎలాంటి నాయకుడో అందరికీ తెలుసు. ఆయన ఆలోచనల్లోంచి శివసేన పార్టీ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వారి ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ అంతు చూడడానికే ఆయన పనిచేశారు. అలాంటిది.. శివసేన అపరిమితమైన అధికార దాహంతో.. అదే కాంగ్రెస్ పార్టీ ని అర్థించి.. వారి మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నించింది. సైద్ధాంతిక భావజాల సారూప్యత ఉన్న భాజపా కుర్చీ పంచుకోవడంలో అహంకారం ప్రదర్శించినందుకు.. ఆ పార్టీ ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిని ఆశ్రయించింది.

నిన్న చంద్రబాబు కూడా ఇదే తప్పు చేశారు. తెలంగాణలో తమ పార్టీకి దిక్కులేని పరిస్థితి ఏర్పడేసరికి.. అన్ని చోట్ల కనీసం అభ్యర్థులను నిలబెట్టే సత్తా కూడా లేకపోయే సరికి గత్యంతరం లేక.. కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ మీద పోరాడడానికి అనే మౌలిక స్ఫూర్తిని ఆయన చంపేసారు. ఆ నిర్ణయం ఆ పార్టీనే పూర్తిగా చంపేసింది.

అలాంటి ఫలితమే మహారాష్ట్రలో శివసేనకు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. వీరు కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధపడినా.. కాంగ్రెస్ ఇలాంటి పొరబాటు చేయలేదు. ఆచితూచి అడుగేయదలచుకుంది. మద్దతుకు సై అనలేదు. దాంతో శివసేన పాచిక పారలేదు. ఆదిలోనే భంగపాటు తప్పలేదు. ఇప్పుడు అధికారం లోకి వచ్చే అవకాశం ఎన్సీపీ చేతిలోకి వెళ్లింది. నిన్న వారి మద్దతు దేబిరించారు గనుక.. ఇవాళ వారు మద్దతు అడిగినా ఇవ్వవలసిన అగత్యం శివసేనకు ఉంది.

ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే.. అధికారం పంచిస్తే మద్దతివ్వడానికి శివసేన సిద్ధపడవచ్చు. ఏతావతా.. పార్టీ మౌలిక స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ తో జతకడితే.. అది శివసేన చేటుకు దారితీయవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?