త్వరలో పవన్ ఛలో బెజవాడ?

రాజకీయాల కోసం సినిమాలు వదిలేసాను. సంపాదన వదిలేసాను అంటూ స్వచ్ఛందంగా ప్రకటించి, రెండు చోట్ల ఓడి పోయిన తరువాత ఒట్టు తీసి గట్టున పెట్టి, తనకు పేపర్లు లేవు, కంపెనీలు లేవు అంటూ తనే…

రాజకీయాల కోసం సినిమాలు వదిలేసాను. సంపాదన వదిలేసాను అంటూ స్వచ్ఛందంగా ప్రకటించి, రెండు చోట్ల ఓడి పోయిన తరువాత ఒట్టు తీసి గట్టున పెట్టి, తనకు పేపర్లు లేవు, కంపెనీలు లేవు అంటూ తనే ప్రకటించి, సినిమాల్లోకి వచ్చేసారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చకచకా సినిమాలు ఒకే చేస్తున్నారు.

ఇది ఇలా 2023 వరకు కొనసాగతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం వేరుగా వుంది.

2022లోనే పవన్ హైదరాబాద్ నుంచి విజయవాడ కు తరలి వెళ్తారని, ఆంధ్ర రాజకీయాల్లో ఫుల్ బిజీ అవుతారని వినిపిస్తోంది. రెండేళ్ల పాటు ఆంధ్ర రాజకీయాల మీద పవన్ పూర్తి స్తాయిలో దృష్టి పెడతారని తెలుస్తోంది.

జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందువల్ల పవన్ కూడా తన షెడ్యూలు మార్చుకుంటారని తెలుస్తోంది. 

ప్రస్తుతం చేస్తున్న భీమ్లా నాయక్ పూర్తికావాల్సి వుంది. మరో నెల రోజులు అయినా పడుతుంది. దాని తరువాత హరి హర వీరమల్లు సినిమా ఫినిష్ చేయాల్సి వుంది. కానీ దీనికి కాస్త సమయం వుందని బోగట్టా. ఈ మధ్యలో ఆంధ్ర లోపార్టీ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆ తరువాతే ఆ సినిమా ఫినిష్ చేస్తారు.

ఆ తరవాత సమయం అనుకూలిస్తేనే మైత్రీ మూవీస్ సినిమా మీదకు వస్తారని, లేదూ అంటే ఎన్నికల తరువాతకు వాయిదా వేస్తారని టాక్ వినిపిస్తోంది. 

నిన్నటికి నిన్న ట్విట్టర్ లో బండ్ల గణేష్ ఒక ట్వీటు వేసారు. అది కూడా హరీష్ శంకర్ ను ట్యాగ్ చేస్తూ. వాయిదా పడడం అంటే అంటూ. కానీ ఆ తరవాత హరీష్ ట్యాగ్ తీసేసారు. ఆ తరువాత ఏకంగా ట్వీట్ నే తీసేయడం విశేషం.

ఈ సమయంలోనే హరీష్ శంకర్ సమాధానం ఇస్తూ, ఏం గాభరా వద్దు అంతా అనుకున్నట్లే ముందుకు వెళ్తుంది అనే అర్థం వచ్చేలా సమాధానం కూడా చెప్పేసారు. ఈ ట్వీట్ సంగతి అలా వుంచితే వీలయినంత తొందరగా హైదరాబాద్ నుంచి విజయవాడకు పవన్ మకాం మారుస్తారనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.

నూటికి రెండు వందలశాతం అన్నంత కచ్చితంగా తెలుగుదేశం-జనసేన కలిసే 2024 ఎన్నికలను ఫేస్ చేయబోతున్నాయి. ఇందులో భాగంగా జనసేన ఎన్నికల వ్యూహాన్ని చంద్రబాబే రచించబోతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దాని అమలుకే పవన్ ఛలో విజయవాడ అనబోతున్నారని తెలుస్తోంది.