ఉత్తరాంధ్ర నుంచి ఉప ముఖ్యమంత్రులను చూశారు. కీలక శాఖలైన హోం, పంచాయతీరాజ్ వంటి శాఖల మంత్రులను చూసారు. ముఖ్యమంత్రి పదవి అయితే దక్కేది లేదు కానీ కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర గవర్నర్లను అందించే ప్రాంతంగా మారుతోందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు.
విశాఖకు చెందిన బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మూడున్నరేళ్ల క్రితం మిజోరాం గవర్నర్ గా కేంద్రం నియమించింది. ఇటీవల ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటుగా హరిబాబుని ఒడిశా వంటి పెద్ద స్టేట్ కి గవర్నర్ గా ప్రమోషన్ మీద నియామకం చేసింది.
విశాఖకు చెందిన హరిబాబుకు గవర్నర్ పదవి ప్రమోషన్ మీద రెండవసారి లభించడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటుగా మరొకరికి కూడా గవర్నర్ చాన్స్ ఉందని తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పోస్టు ఖాయం అయింది అని వార్తలు వినవస్తున్నాయి. బీజేపీ తరువాత కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రాధాన్యత అన్ని విషయాలలో దక్కుతోంది. ఈ క్రమంలో ఒక గవర్నర్ పదవిని టీడీపీకి ఆఫర్ చేశారు అని అంటున్నారు.
ఆ పదవి అశోక్ గజపతిరాజు కోసం రిజర్వ్ అయింది అని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కనుక సాధ్యమైనంత త్వరలోనే విజయనగరం రాజా వారు రాజ్ భవన్ లోకి గవర్నర్ గా ప్రవేశిస్తారు అని అంటున్నారు. ఆయనకు కూడా గవర్నర్ పదవి దక్కితే ఉత్తరాంధ్ర నుంచి ఒకే సమయంలో ఇద్దరికి గవర్నర్ పోస్టులు దక్కినట్లు అవుతుంది. ఇది ఈ ప్రాంతానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇచ్చే వైనంగా అంతా భావిస్తున్నారు.
అన్ని విధాలా అర్హుడు రాజు గారు
no representation from Rayalaseema ?