cloudfront

Advertisement


Home > Politics - Gossip

ప్రతిపక్షం లేని అసెంబ్లీ.. ప్రజాస్వామ్యానికి మంచిదేనా?

ప్రతిపక్షం లేని అసెంబ్లీ.. ప్రజాస్వామ్యానికి మంచిదేనా?

ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. కొన్నికొన్ని సార్లు ఒకే పార్టీ క్లీన్ స్వీప్ చేయడం కూడా మంచిది కాదు, అది నియంతృత్వానికి దారితీసే అవకాశముంది. ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో ఇది అత్యవసరం. కానీ తెలంగాణలో మాత్రం ఈ వ్యవస్థ నిర్వీర్యం కాబోతోంది. ప్రజాస్వామ్యానికి పెనుసవాల్ విసరబోతోంది.

గత ప్రభుత్వంలో తెలంగాణ టీడీపీని అధికారికంగా, కాంగ్రెస్ ని అనధికారికంగా టీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు కేసీఆర్. ఈసారి కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని అధికారికంగా టీఆర్ఎస్ శాసన సభాపక్షంలో విలీనం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగినప్పటికీ.. ఆ వచ్చే తీర్పు కంటే నెక్ట్స్ టర్మ్ ఎన్నికలే ముందు వచ్చే అవకాశాలున్నాయి. సో.. ఇక్కడ న్యాయాన్యాయాల సమస్యలేదు. ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా ప్రజలే బలిపశువులు అవుతున్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసుకోవాలనేది టీఆర్ఎస్ ఆలోచన. ప్రజలు మెజార్టీ కట్టబెట్టినా కక్కుర్తితో ఈ బరితెగింపుకు సిద్ధపడింది టీఆర్ఎస్. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసి జబ్బలు చరుచుకోవాలనే దిగజారుడు ప్లాన్ వేసింది. అప్పటికీ కొంతమంది కమిట్ మెంట్ ఉన్ననేతలు కాంగ్రెస్ లో ఉండటం, లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్ కోలుకోవడంతో ఈ ఎత్తుగడ ఫలించేలా కనపడలేదు.

తీరా ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఊసరవెల్లులన్నీ ఒక దగ్గరకు చేరాయి. కాంగ్రెస్ బలం 18కి తగ్గడంలో మూడింట రెండొంతుల మంది అంటే 12మంది ఫిరాయింపులకు బరితెగించారు. టీఆర్ఎస్ లో కలిసిపోతామని స్పీకర్ ను కలసి చెప్పడం, ఆయన నోటిఫికేషన్ జారీ చేయడం.. విలీనం చేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అలా తెలంగాణలో కాంగ్రెస్ కి విపక్ష హోదా గల్లంతు అయింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కి ఆరుగురు ఎమ్మెల్యేలే మిగిలారు. అంటే టెక్నికల్ గా చూస్తే తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షం లేనట్టే.

ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎంఐఎం రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ తోనే కాబట్టి.. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినపడే ఛాన్సేలేదు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రజలకు మంచి జరుగుతుందా? ప్రభుత్వ తప్పుల్ని, సమస్యల్ని ఎత్తిచూపేది ఎవరు? ఈ ప్రశ్నలకి ఎవరు సమాధానం చెబుతారు? ప్రతిపక్షంలేని అసెంబ్లీలో అధికార పార్టీ ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యులు?

టీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ప్రజలు 19 స్థానాల్లో కాంగ్రెస్ ని గెలిపించారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రం టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఆకర్షించాయట. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు లేని ఆకర్షణ ఇప్పుడు కొత్తగా ఎందుకొచ్చిందో ఆ 12మందికే తెలియాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పార్టీ ఫిరాయించారు ఈ ఎమ్మెల్యేలు.

ఏపీలో ఇలాంటి ఊసరవెల్లులకు తాజా ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పారు ప్రజలు. గోడదూకిన ఏ ఒక్కరూ గెలవలేదు. రేపు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. అయినా అంతమాత్రం ఆగేదెవరు. ఆలోపు అందినకాడికి వెనకేసుకోడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కారు. ప్రభుత్వ ఏర్పాటుకి సరిపోయే ఎమ్మెల్యేలు ఉండి కూడా ఇలా వలసల్ని ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ది కూడా ముమ్మాటికీ తప్పే.

రాజ్యసభ ఎంపీ పదవులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను ఇలా లాక్కోవడం ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిదికాదు. ప్రతిపక్షం లేకుండా పరిపాలన సాగించాలని చూస్తున్న కేసీఆర్ ఆలోచన అప్రజాస్వామికం. ఇకనైనా తెలంగాణ పాలకులు ఈ విషయంలో పునరాలోచించుకుంటే మంచిది. 

6 నెలలు కాదు.. 6 రోజుల్లోనే దూకుడు

సినిమా రివ్యూ: హిప్పీ